నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మేకల మంద వద్ద కాపలాగా ఉన్న ఉంచి వెళ్లిన అయిదుమంది చిన్న పిల్లలు రిజర్వాయర్లో పడి జలసమాధి అయ్యారు. ఆ అయిదుమంది పెదనాన్న, చిన్నాన్న కుమారులు. జిల్లాలోని కొండమల్లేపల్లి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మండలంలోని గుడితండా పెండ్లిపాకల వద్ద ఓ చిన్నతరహా రిజర్వాయర్ నిర్మాణంలో ఉంది. అక్కడ నీళ్లు నిల్వ ఉన్నాయి. గుడితండాకు చెందిన నేనావత్ సర్దార్, హన్మ, ఓంకార్ అన్నదమ్ములు. వారి పిల్లలు శివ, నవదీప్, సాత్విక్, రాకేశ్, సంతోష్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు.
ఒంటిపూట బడి కావడంతో శనివారం పాఠశాల అనంతరం సాయంత్రం రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. అక్కడే మేకలు కాస్తున్న నేనావత్ ఓంకార్ వారిని హెచ్చరించి, ఇంటికి వెళ్లాలని సూచించాడు. మేకలు మేపుతూ వెళ్లగానే.. చిన్నారులు చెరువులోకి దిగారు. ఎవరికీ ఈత రాదు.
అయిదుమందీ నీట మునిగారు. జలసమాధి అయ్యారు. కొద్దిసేపటి తరువాత ఓంకార్ వెనక్కి వచ్చి చూడగా.. రిజర్వాయర్ ఒడ్డున పిల్లల దుస్తులు కనిపించాయి. చెరువులో మృతదేహాలు లభించాయి. సమాచారమందుకున్న పిల్లల తల్లిదండ్రులు వచ్చి మృతదేహాలను చూసి గుండెలవిసేలా విలపించారు. చిన్నారుల మృతితో గుడితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దేవరకొండ ఆసుపత్రికి తరలించారు.