తెలుగు రాష్ట్రాల ప్రజలను అవమానించిన అరుణ్ జైట్లీ.. మనం నోట్ల కట్టలు దాచుకుంటున్నామట..!

భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న సాయంత్రం మీడియాతో ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. ఆయన అంత నిక్కచ్చిగా చెప్పడంతో తెలుగు రాష్ట్రాల నాయకులందరూ ఏకమయ్యారు. తాము ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోడానికి సిద్ధమేనని తేల్చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో అరుణ్ జైట్లీ తెలుగు రాష్ట్రాల ప్రజలను కించపరుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలు డబ్బుల కట్టలు దాచుకుంటున్నారని.. అందుకే ఏటీఎం లలో డబ్బులు రావడం లేదని ఎగతాళిగా మాట్లాడారు.

ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడటం వెనుక తెలుగు ప్రజలు ఎక్కువగా కరెన్సీని ఇళ్లలో దాచుకున్నారని, అందువల్లే కొరత ఏర్పడిందని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా తెలంగాణ బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పుష్పలీల కల్పించుకుంటూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో డబ్బులు లేవని, దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వెంటనే అదనంగా డబ్బు పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అయితే బాధ్యతగల మంత్రిగా మాట్లాడాల్సిన ఆయన వెటకారంగా మాట్లాడారు. తాము ఇప్పటికే పంపించాల్సిన డబ్బు కన్నా చాలా అధికంగానే కరెన్సీ నోట్లను ఏపీ, టీఎస్(తెలంగాణ రాష్ట్రం) లకు పంపించానని చెప్పారు. ప్రజలు నోట్ల కట్టలను బ్యాంకు లాకర్లలో, ఇళ్లల్లో దాచుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన వెటకారంగా మాట్లాడిన మాట పట్ల తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని భావిస్తున్న ప్రజలు.. ఆయన మాట్లాడిన మాటలకు ఇంకా కోపం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here