రాత్రి కొడుకు మరణించినా.. ఉదయం వరకూ దత్తాత్రేయకు చెప్పలేదట..!

ఎదిగిన కొడుకు మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం..! ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కుటుంబంలో అదే చోటుచేసుకుంది. ఆయన ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్ గుండెపోటు తో హఠాన్మరణం చెందాడు. వైష్ణవ్ మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు మృతి చెందాడు. అయితే ఈ విషయం బండారు దత్తాత్రేయకు ఎప్పుడు తెలిసిందంటే.. ఉదయం 5 గంటలకట.

దత్తాత్రేయకు తెల్లారే వరకూ తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డామని, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ పని చేయాల్సి వచ్చిందని దత్తన్న బంధువులు వెల్లడించారు. అర్ధరాత్రి వైష్ణవ్ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించగా, కుమారుడంటే అమితమైన ప్రేమను చూపే దత్తాత్రేయకు ఆ విషయాన్ని చెబితే, ఏమవుతుందోనన్న ఆందోళనలో విషయాన్ని చెప్పలేదు. వైష్ణవ్ మృతదేహాన్ని కూడా తెల్లవారుజాము వరకూ ఆసుపత్రిలోనే ఉంచి, ఆపై ఇంటికి తీసుకెళ్లారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో రోజులాగానే లేచిన దత్తాత్రేయకు అప్పుడు విషయాన్ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here