గులాబీ ప్లీనరీలో కేసీఆర్ మాటల తూటాలు..!

ఈ రోజు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో ప్రారంభమైన 17వ తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల తూటాలను పేల్చారు. తాను ఎవరికీ భయపడనని.. దేశ బాగు కోసం పోరాడతానని చెప్పుకొచ్చారు కేసీఆర్.. అంతే కాకుండా రాష్ట్రాల మీద కేంద్రాల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు ఏటీఎంలలో డబ్బులు దొరక్కపోయినా… మోడీలు మాత్రం దోచుకుని పారిపోతారని విమర్శించారు.

దేశ రాజకీయాలపై తాను చేసిన ప్రకటనతో ప్రకంపనలు పుట్టాయని కేసీఆర్ అన్నారు. తాను ఎవ్వరికీ భయపడనని… దేశ బాగు కోసం తాను పోరాడతానని చెప్పారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కేసీఆర్ అంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల అసమర్థత వల్లే నీటి యుద్ధాలు వస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉందని… సాగుభూమి 40 కోట్ల ఎకరాలు మాత్రమేనని… 40 వేల టీఎంసీలతో ప్రతి ఎకరాకు నీటిని ఇవ్వచ్చని కేసీఆర్ చెప్పారు. నీటి వివాదాలను ట్రైబ్యునళ్లు తాత్సారం చేస్తుండటంతో… రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు. 40 కోట్ల ఎకరాలకు నీటిని ఇచ్చే పథకాలను రూపొందిస్తామని, ఫెడరల్ స్పూర్తితో రైతాంగ సమస్యలపై పోరాడతామని చెప్పారు.

రైల్వే వ్యవస్థ అద్వాన్నంగా ఉందని, ఎయిర్ పోర్టులు, పోర్టులు దారుణంగా ఉన్నాయని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే న్యూయార్క్ లోని టాయ్ లెట్లు బాగుంటాయని చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలలో కేంద్రానికి ఏం పని? అని ప్రశ్నించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని… గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుడతానని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగానే భూకంపం పుట్టిస్తానని, దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకొస్తానని అన్నారు. ఈ నెల 29న చెన్నైకి వెళ్లి డీఎంకే నేతలను కలుస్తానని కేసీఆర్ చెప్పారు. మే 2వ తేదీన హైదరాబాదులో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరుపుతామని తెలిపారు.


అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, ప్రపంచం కీర్తించిన అపూర్వమైన పథకాలు మిషన్‌ కాకతీయ, భగీరథ అని కేసీఆర్‌ అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. గతేడాది 19.88 శాతం సొంత రాబడితో దేశంలో అగ్రస్థానంలో నిలిచామని అన్నారు. టీపీసీసీ నేతలు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులు వేశారని ఆరోపించారు. తాము 2014లో ఎన్నికల ముందు పెట్టిన మెనిఫెస్టోను నూరు శాతం అమలు చేశామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here