కంప్యూట‌ర్ క్లాస్‌కు వెళ్లిన యువ‌తి..అయిదు రోజుల త‌రువాత!

కంప్యూట‌ర్ క్లాసుల‌కు వెళ్లిన ఓ యువ‌తి ఇక మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి రాలేదు. ఊరి శివార్ల‌లో మృత‌దేహ‌మై తేలారు. స‌గం కాలిన ఆమె మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని సూర్యాపేట్ జిల్లాలో చోటు చేసుకుంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను హ‌త‌మార్చి ఉంటార‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

జిల్లాలోని నాగారం మండ‌లం వ‌ర్ధ‌మాను కోట గ్రామానికి చెందిన ఆ యువ‌తి పేరు అన్న‌పూర్ణ‌. జిల్లాలోని తిరుమ‌ల‌గిరిలో కంప్యూట‌ర్ కోర్స్ చేస్తున్నారు.

ఈ నెల 26వ తేదీన‌ ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అన్న‌పూర్ణ‌.. ఆ త‌రువాత ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు చాలా చోట్ల గాలించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది.

దీనితో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌గా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అన్న‌పూర్ణ కోసం గాలిస్తున్న ప‌రిస్థితుల్లోనే ఆమె మృత‌దేహం వారికి ల‌భించింది.

ఉద‌యం ఎస్సారెస్పీ కాలువ స‌మీపంలో ఆమె మృత‌దేహం క‌నిపించింది. ఈ విష‌యాన్ని స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని ప‌రిశీలించ‌గా, అది అన్న‌పూర్ణ‌ద‌ని తేలింది. గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి చంపినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి కాల్ లిస్ట్‌ ఆధారంగా కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here