వేరొక‌రితో పెళ్లికి సిద్ధ‌ప‌డిన యువ‌తిపై పెళ్లి పందిట్లోనే క‌త్తితో దాడి..!

శివ‌మొగ్గ‌: త‌న‌ను కాద‌ని, వేరొక‌రిని పెళ్లి చేసుకుంటున్న యువ‌తిపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడో కిరాత‌కుడు. పెళ్లి పీట‌ల మీదే ఆమెపై క‌త్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయ‌ప‌డ్డ యువ‌తి ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ జిల్లాలోని సాగ‌ర తాలూకా ప‌రిధిలో ఉన్న భీమ‌న కోనె గ్రామంలో చోటు చేసుకుంది.

బాధితురాలి పేరు సునీత (పేరుమార్చాం). సునీత‌ను అదే గ్రామానికి చెందిన నంద‌న్ అనే యువ‌కుడు ప్రేమించాడు. అత‌ను సాగ‌ర ప‌ట్ట‌ణంలో ఆర్టీఓ బ్రోక‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఆరు నెల‌ల నుంచి సునీత ప్రేమిస్తున్నాడు. త‌న ప్రేమ‌ను అత‌ను సునీత‌కు వెల్ల‌డించ‌గా.. ఆమె తిర‌స్క‌రించింది. దీనితో నంద‌న్‌ ఆమెపై క‌సి పెంచుకున్నాడు.

ఇదిలావుండ‌గా.. సోమ‌వారం ఉద‌యం సునీత భ‌ర‌త్‌ యువ‌కుడిని పెళ్లి చేసుకుంది. భీమ‌న‌కోనె గ్రామంలోని వ‌రుడి ఇంట్లో ఈ పెళ్లి జ‌రిగే స‌మ‌యంలో.. హ‌ఠాత్తుగా నంద‌న్‌ క‌త్తితో దాడి చేశాడు. సునీత మెడపై న‌రికాడు. ఈ దాడిలో ఆమె మెడ‌, చేతుల‌పై గాయాల‌య్యాయి.

ఈ దాడిని ఆమె చిన్నాన్న గంగాధ‌ర‌ప్ప అడ్డుకోబోగా.. ఆయ‌న‌నూ గాయ‌ప‌రిచాడు. బంధువులు నంద‌న్‌ను ప‌ట్టుకున్నారు. దేహ‌శుద్ధి చేశారు. పోలీసుల‌కు అప్ప‌గించారు. గాయ‌ప‌డ్డ ఇద్ద‌ర్నీ సాగ‌ర ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం మెరుగైన వైద్యం కోసం శివ‌మొగ్గ జిల్లా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here