అర్ధ‌రాత్రి ఒంటిగంట‌కు సుప్రీం విచార‌ణ‌: గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యంపై ఏమీ చేయ‌లేం.. ప్ర‌మాణాన్ని ఆప‌లేం!

తెల్ల‌వారితే బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం. దానికి కొన్ని గంట‌ల ముందే- సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కింది కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి. ప్ర‌జాస్వామ్యాన్ని గ‌వ‌ర్న‌ర్‌ ప‌రిహాసం చేస్తున్నారని ఆరోపిస్తూ రాత్రికి రాత్రి సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసింది.

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మెజారిటీ లేన‌ప‌ప‌టికీ.. బీజేపీకి గవ‌ర్న‌ర్ అవ‌కాశం ఇచ్చార‌ని, దీన్ని నిలువ‌రించాల‌ని కోరుతూ కూట‌మి నాయ‌కులు పిటీష‌న్ వేశారు. కూట‌మి త‌ర‌ఫున కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ ఈ పీటీష‌న్ దాఖ‌లు చేశారు. దీన్ని విచార‌ణ‌కు స్వీక‌రించింది సుప్రీంకోర్టు.

తెల్ల‌వారితే ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి ఉన్నందున‌.. అర్ధ‌రాత్రి ఒంటిగంట‌కు విచార‌ణకు చేప‌ట్టింది. జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌ బోబ్డేలతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వ‌హించింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ల తరపును కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి, బీజేపీ తరపున ఏఎస్‌జీ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించిన బీజేపీకి అవ‌కాశం ఇవ్వ‌డంలో తప్పేమీ లేద‌ని, పూర్తి కాలం కొన‌సాగించ‌క‌, 15 రోజుల గ‌డువు ఇచ్చార‌ని తుషార్ మెహ‌తా వాదించారు. ఈ గ‌డువులోగా బీజేపీ ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో త‌న బ‌లాన్ని నిరూపించుకోలేక‌పోతే విప‌క్షాల‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని అన్నారు. తుషార్ మెహ‌త వాద‌న‌ల‌తో బెంచ్ ఏకీభ‌వించింది. రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఉన్నందున‌.. తామేమీ చేయ‌లేమ‌ని బెంచ్ స్ప‌ష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here