`ఎన్టీఆర్ అంతటి మహనీయుడిపైనే కుట్రలు పన్నిన నీచుడు చంద్రబాబు. మా నాయకుడు ఎన్టీఆర్ మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబే …. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారు. కానీ పట్టపగలే అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి, చంద్రబాబులు ముద్దాయిలు.
తన అవసరాల కోసం మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టిన బాబు.. ఇప్పుడు బీసీలకు, కాపులకు మధ్య కొట్లాట పెడుతున్నారు. చివరకు బ్రాహ్మణులు మధ్య చిచ్చురేపిన మేధావి. నిజంగా ఈ వ్యవస్థకు చంద్రబాబు పెద్ద ముప్పు. యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకున్న చంద్రబాబు ప్రత్యేక హోదా పేరెత్తడానికి కొంచమైనా సిగ్గుపడాలి.
చరిత్రలో చంద్రబాబు కంటూ ఓక నల్లపేజీ ఉంటుంది. ఈ దుర్మార్గుడిని పాతళంలోకి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాకు గవర్నర్ పదవి/రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తానని మాటిచ్చాడు. కానీ రాజ్యసభ సీట్లను వంద కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. ఏపీ ప్రజలు ఈసారి చంద్రబాబును ఓడించాలి.
జగన్ ఒక మొగోడి లాగా జెండా పెట్టుకున్నారు. బాబు దొంగలా జెండా దొంగలించారు. ముఖ్యమంత్రి పదవే కాదు ఆఖరికి ఎన్టీఆర్ అకౌంట్ లో డబ్బులు కూడా లాక్కున్న నీచుడు చంద్రబాబు..` ఇవీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన ఆరోపణలు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్‌లో ఎన్టీఆర్ సమాధికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్‌ను తలచుకుని కన్నీరు పెట్టారు. చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీని ఎన్టీ రామారావు వారసులకు అప్పగించాలని అన్నారు.