పలు రకాల జంతువులను, పక్షులను చూడడానికి ‘జూ’ లకు వెళుతూ ఉంటాం. అయితే జూలో ప్రవేశానికి డబ్బులు కత్తి ప్రవేశించాల్సి ఉంటుంది. కానీ ఓ వ్యక్తి టికెట్ లేకుండా లోపలికి ప్రవేశించాడు. ఎలాగోలా లోపలికైతే వచ్చాడు కానీ.. అతడి భార్య, పిల్లల ముందే ఆ వ్యక్తి పులి చేతిలో హతమయ్యాడు.
ఈ ఘటన చైనాలోని నింగ్బో పట్టణంలోని యోంగోర్ జంతుప్రదర్శన శాలలో చోటుచేసుకుంది. ఝెంగ్ అనే వ్యక్తి తన స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి జూకు వెళ్దామని అనుకున్నాడు. అయితే ఎంట్రీ టికెట్ తీసుకోకుండా లోపలికి ప్రవేశించాలని అనుకున్నాడు. అయితే అతడు వచ్చే దారిలో పులుల ఎంక్లోజర్ కూడా ఉంది. అలా వస్తూ వస్తూ పులులు ఉన్న ప్రాంతంలో పడ్డాడు. సైబీరియన్ పులులు అతడు కిందపడగానే అతన్ని చుట్టుముట్టేశాయి. తన కాళ్ళతో వాటిని తన్నడానికి ప్రయత్నించాడు ఝెంగ్.. కానీ ఆ ప్రయత్నం విఫలం అయ్యింది. అతడి చుట్టూ మూగిన పులులు అతడిపై దాడి చేశాయి.. ఓ పులి అతడి మెడను కొరకడంతో ప్రాణాలు వదిలేశాడు ఝెంగ్.
జూ సిబ్బంది టపాకాయలు కాల్చి పులులను బయపెట్టాలని ప్రయత్నించినప్పటికీ పులులు అతన్ని వదిలిపెట్టలేదు. దాదాపు గంట తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా.. చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. ఝెంగ్ తో పాటూ అతడి స్నేహితుడు లీ కూడా ఫెన్సింగ్ ను దాటుకొని జూలోకి వెళ్ళడానికి ప్రయత్నించారట.. అయితే ఝెంగ్ జారి కిందపడిపోవడంతో అతడు పులులకు బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.