యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో నివసించే కొన్ని దేశాల ప్రజల విసా గడువును మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు దుబాయ్ రూలర్, ఉపాధ్యక్షుడు షేఖ్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడి సతమతమౌతున్న దేశ ప్రజలకు ఈ విసా గడువు పొడిగింపు వర్తిస్తుంది.
సిరియా వంటి దేశాలు ఇప్పటికే అంతర్గత యుద్ధాలతో అల్లాడుతున్నాయి. అలాంటి దేశాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఎమిరేట్స్‌లో నివసిస్తున్నారు. తమ దేశాల్లో ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగు పడేంత వరకు వారు ఎమిరేట్స్‌లో వారు నివసించేలా ఏర్పాట్లు చేయడంలో భాగంగా.. అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల ప్రజలకు అత్యవసర విసాను జారీ చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.