పెళ్లిలో ఇచ్చిన గిఫ్ట్‌ప్యాక్‌ను తెరిచిన కొత్త దంప‌తులు.. అది బాంబులా పేలి!

భువ‌నేశ్వ‌ర్‌: పెళ్లిలో బంధువులు ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ ఒక‌టి బాంబులా పేలింది. అది కూడా వంట‌గ‌దిలో పేల‌డంతో.. దాని తీవ్ర‌త రెట్టింప‌యింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా.. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు.

ఈ ఘ‌ట‌న ఒడిశాలోని బాలంగిర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ప‌ట్నాగ‌ఢ్ తాలూకా బ్ర‌హ్మ‌పుర గ్రామానికి చెందిన సౌమ్యా రంజ‌న్ సాహుకు ఈ నెల 21వ తేదీన బౌద్ధ్ జిల్లా ఘంటాపాడ గ్రామానికి చెందిన రీమాతో వివాహమైంది.

 

 

ఇది పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి. ఈ వివాహానికి ప‌లువురు బంధుమిత్రులు హాజ‌ర‌య్యారు. పెద్ద ఎత్తున కానుక‌లు అంద‌జేశారు. అదేరోజు సాయంత్రం బ్ర‌హ్మ‌పుర గ్రామానికి చేరుకున్నారు. పెళ్లి సంద‌డి స‌ద్దు మ‌ణిగిన త‌రువాత..పెళ్లిలో అందిన బ‌హుమ‌తులు, కానుక‌లు, గిఫ్ట్ ప్యాక్‌ల‌ను ఒక్క‌టొక్క‌టిగా తెరిచి చూడ‌సాగారు.

ఎలాంటి పేరు గానీ, ఇత‌ర అడ్ర‌స్ గానీ లేని గిఫ్ట్ ప్యాక్‌ను తెరిచిన వెంట‌నే అది పెద్ద శ‌బ్దం చేస్తూ బాంబులా పేలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో కొత్త దంప‌తుల‌తో పాటు సౌమ్యా రంజ‌న్ సాహు నాయ‌న‌మ్మ జ‌మునాని సాహు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఈ శ‌బ్దం విన్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న స్థానికులు వారిని బాలంగిర్ జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ జ‌మునాని సాహు మ‌ర‌ణించారు.

కొత్త దంపతుల‌కు ప్రాణాపాయం త‌ప్పింద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న ప‌ట్నాగ‌ఢ్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇది పార్సెల్ బాంబు అయి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. ఆ గిఫ్ట్ ప్యాక్ ఇచ్చిన వారి కోసం అన్వేషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here