120 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లిన కేటీఎం బైక్‌..రోడ్డుమీదికి వ‌చ్చిన 11 ఏళ్ల బాలిక‌ను ఢీకొట్టింది..

బైక్ రేసుల‌కు 11 ఏళ్ల బాలిక బ‌లైంది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్క‌బ‌ళ్లాపుర జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు అంజు. బుళ్ల‌హ‌ళ్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ కుమార్తె ఆమె.

జిల్లాలోని దేవ‌న‌హ‌ళ్లి తాలూకా ప‌రిధిలోని అవ‌తి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిషిత్ అనే యువ‌కుడు త‌న ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి బైక్‌ల‌పై బెంగ‌ళూరు నుంచి కోలార్ స‌మీపంలోని అంత‌ర‌గంగె బెట్ట‌కు బ‌య‌లుదేరాడు.

బెంగ‌ళూరు శివార్ల‌కు చేరుకున్న త‌రువాత వారు రేస్ నిర్వ‌హించారు. ఎవ‌రు త్వ‌ర‌గా అంత‌ర‌గంగెకు చేరుకుంటారో అనేది బెట్టింగ్‌. నిషిత్ త‌న కేటీఎం డ్యూక్ బైక్‌పై ర‌య్‌మంటూ దూసుకెళ్లాడు.

మార్గ‌మ‌ధ్య‌లో అవ‌తి గ్రామంలోకి ప్ర‌వేశించిన త‌రువాత అత‌ని బైక్ అదుపు త‌ప్పింది. ఇంట్లో నుంచి మంచినీటి కోసం రోడ్డు మీదికి వచ్చిన అంజును వేగంగా ఢీ కొట్టింది.

ఈ ఘ‌ట‌న‌లో అంజు సంఘ‌ట‌నాస్థ‌లంలోనే తుదిశ్వాస విడిచింది. ఆ స‌మ‌యంలో బైక్ వేగం 120 కిలోమీట‌ర్ల మేర ఉన్న‌ట్టు గుర్తించారు. దీనితో ఆగ్ర‌హావేశాల‌కు గురైన స్థానికులు నిషిత్‌ను ప‌ట్టుకుని చిత‌గ్గొట్టారు. చెట్టుకు క‌ట్టేశారు.

ఈ లోగా అత‌ని స్నేహితులు కూడా అక్క‌డికి చేరుకున్నారు. వారి బైక్‌ల‌ను స్థానికులు ధ్వంసం చేశారు. అనంత‌రం విజ‌య‌పుర పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. చెట్టుకు క‌ట్టివున్న నిషిత్‌ను విడిపించి, స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌నతో సుమారు రెండు కిలోమీట‌ర్ల మేర వాహ‌నాల రాక‌పోక‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here