13 మంది చిన్నారుల ప్రాణాలు అన్యాయంగా.. కాపలాలేని రైల్వే గేటు..!

దేశంలో కాపలా లేని రైల్వే గేట్లు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను తీశాయి.. ప్రభుత్వం ఏదైనా ఘటన జరిగినప్పుడు స్పందించడం.. ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం ఎన్నో ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇప్పుడు అలాంటిదే మరొక ఘటన.. 13 మంది చిన్నారుల ప్రాణాలు కాపలాలేని రైల్వే గేటు కారణంగా గాల్లోకి కలిసిపోయాయి.. ఎంతో మంది కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ఖుషీ నగర్ లో చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళుతున్న స్కూలు వాహనాన్ని రైలు ఢీకొంది. ఇప్పటిదాకా 13 మంది పిల్లలు మరణించినట్లు తెలుస్తోంది. వీరందరి వయసూ 10 సంవత్సరాల్లోపే. అందరూ ఖుషీనగర్ లోని డివైన్ పబ్లిక్ స్కూలు చిన్నారులే. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాదాపు 25 మందితో వెళుతున్న వ్యాన్ ను ఉదయం 6.45 – 7 గంటల మధ్య రైలు ఢీకొందని తెలిపారు. సాధారణంగా థావే-కపటన్ గంజ్ రైలు ఉదయం 6 గంటలకే లెవల్ క్రాసింగ్ ప్రాంతాన్ని దాటి వెళ్లిపోతుంది. ఈ ఉదయం మాత్రం ఆలస్యమై 6.45 గంటల తరువాత వచ్చిందని తెలుస్తోంది. కాపలా లేని లెవల్ క్రాసింగ్ ఇదని అన్నారు. అందువల్లే దుర్ఘటన జరిగిందని, ఇక్కడ గేటు పెట్టాలని ఎప్పటి నుంచో వేడుకుంటున్నామని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చనిపోయిన పిల్లలకు 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here