వేస‌వి శిబిరం..తొలి రోజే విషాదం..!

పుణే/చెన్నై: మ‌హారాష్ట్రలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. వేస‌వి శిబిరంలో భాగంగా ట్రెక్కింగ్‌కు వెళ్లిన ముగ్గురు బాల‌లు మ‌ర‌ణించారు. ముల్షి జ‌లాశ‌యాన్ని చూడ‌టానికి వెళ్లిన ఆ ముగ్గురూ అందులో ప‌డి జ‌ల‌స‌మాధి అయ్యారు. పుణేకు 45 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మృతుల‌ను డానిష్ రాజా, కె సంతోష్‌, శ‌ర‌వ‌ణ‌గా గుర్తించారు. మృతులు చెన్నైకి చెందిన విద్యార్థులు. చెన్నైలోని ఈసీఎస్ మెట్రిక్యులేష‌న్ స్కూల్‌లో వారు చ‌దువుకుంటున్నారు. మూడురోజుల వేస‌వి శిబిరంలో భాగంగా ఈసీఎస్ స్కూల్‌కు చెందిన 20 మంది విద్యార్థులు, న‌లుగురు ఉపాధ్యాయులు పుణేకు వెళ్లారు.

అక్క‌డి నుంచి 45 కిలోమీట‌ర్ల దూరంలో క‌ట‌ర్‌ఖ‌డ‌క్ గ్రామానికి ఆనుకుని ఉన్న ముల్షీ రిజ‌ర్వాయ‌ర్‌ను చూడ‌టానికి వెళ్లారు. చుట్టూ కొండ‌లు, ప్ర‌కృతి అందాల మ‌ధ్య ఉంటుందీ రిజ‌ర్వాయ‌ర్‌. డానిష్ రాజా, కె సంతోష్‌, శ‌ర‌వ‌ణ రిజ‌ర్వాయ‌ర్ బ్యాక్‌వాట‌ర్‌లోకి దిగారు. వారు దిగిన చోట లోతు ఎక్కువ‌గా ఉండ‌టంతో మునిగిపోయారు.

మూడురోజుల వేస‌వి శిబిరం తొలి రోజే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే పౌడ్‌రోడ్ పోలీస్‌స్టేష‌న్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. డానిష్ రాజా మృత‌దేహాన్ని వెలికి తీశారు. మ‌రో ఇద్ద‌రి మృత‌దేహాల కోసం గాలిస్తున్నారు. మృతుల త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here