జోగి, జోగి రాసుకుంటే: అయిదుమంది బాబాల‌కు మంత్రుల హోదా!

భోపాల్‌: జోగి, జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంటూంటారు పెద్ద‌లు. ఇక్క‌డ మాత్రం అయిదుమంది బాబాల జోగులు రాసుకుంటే ఏకంగా మంత్రిత్వ హోదా వ‌చ్చి ప‌డింది. ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు..అయిదుమంది బాబాల‌కు మంత్రుల హోదాను క‌ల్పిస్తూ ఉత్త‌ర్వుల‌ను విడుద‌ల చేసింది మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. ఇప్పుడ‌దే అక్క‌డ హాట్ టాపిక్‌.

వివాదాస్ప‌ద `కంప్యూట‌ర్ బాబా`తో పాటు మ‌రో న‌లుగురికి మంత్రుల హోదాను క‌ల్పిస్తూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. కంప్యూట‌ర్ బాబా. ఆయ‌న చేతిలో ఎప్పుడూ ల్యాప్‌టాప్ ఉంటుంది. అది లేనిదే ఆయ‌న కాలు బ‌య‌ట‌పెట్ట‌రు.

కంప్యూట‌ర్ బాబాతో పాటు న‌ర్మ‌దానంద మ‌హ‌రాజ్‌, హ‌రిహ‌రానంద మ‌హ‌రాజ్‌, భ‌య్యు మ‌హ‌రాజ్‌, పండిత్ యోగేంద్ర మ‌హంత్‌ల‌కు మంత్రిత్వ హోదా క‌ట్టెబెట్టింది అక్క‌డి ప్ర‌భుత్వం.  ప్ర‌భుత్వం నుంచి జీతాలు, అధికారిక కార్లు, వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌, మంత్రుల అధికారిక నివాసంలో వ‌స‌తి, కాన్వాయ్‌..ఇవ‌న్నీ ఉంటాయి.

దీనిపై ఆ రాష్ట్రంలో పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది. ఏ కార‌ణంతో, దేని కోసం వారికి మంత్రుల హోదా ఇచ్చారంటూ ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌బోతున్నందున, హిందూ ఓటు బ్యాంకును కొల్ల‌గొట్ట‌డానికే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుందనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here