బాలిక‌తో రెండో పెళ్లి చేయ‌లేద‌నే ఆగ్ర‌హంతో..ఇంట్లో వారంద‌ర్నీ!

రాంచి: జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మైన‌ర్ బాలిక‌ను ఇచ్చి, త‌న‌కు రెండోపెళ్లి చేయ‌లేద‌నే ఆగ్ర‌హంతో ఓ వ్య‌క్తి పైశాచికంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ బాలిక‌తో స‌హా అయిదుమందిని హ‌త్య చేశాడు. బాలిక‌తో పాటు ఆమె త‌ల్లిదండ్రులు, ఇద్ద‌రు సోద‌రుల‌ను దారుణంగా హ‌తమార్చాడు.

కింద‌టి నెల 14వ తేదీన జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్‌బ‌మ్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. జిల్లాలోని గువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తులసై గ్రామానికి చెందిన రామ్‌ సింగ్‌ సిర్కాకు భార్య పాను కై, కుమార్తె రంభ, కుమారులు కండె, సోన్యా ఉన్నారు. రంభ వ‌య‌స్సు 17 సంవ‌త్స‌రాలు.

ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ ఓ వ్య‌క్తి వేధించేవాడు. ఆ వ్య‌క్తి ఇదివ‌ర‌కే వివాహితుడు. రంభ‌ను రెండో పెళ్లి చేసుకుంటాన‌ని, త‌న‌కిచ్చి పెళ్లి చేయాలంటూ సిర్కా వెంట ప‌డుతుండేవాడు. దీనికి సిర్కా అంగీక‌రించ‌లేదు. దీనితో అత‌ను తొమ్మిదిమంది త‌న స్నేహితులతో క‌లిసి సిర్కా ఇంటిపైకి దాడి చేశాడు. ఆ స‌మ‌యంలో అత‌ను ఇంట్లో లేడు.

ఇనుప క‌డ్డీలు, క‌త్తుల‌తో స్వైర విహారం చేశారు. క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్టే హ‌త‌మార్చాడు. రంభ‌, ఆమె త‌ల్లి పానుకై, ఇద్ద‌రు సోద‌రుల మృత‌దేహాల‌ను స‌మీపంలోని అడవిలో పడేశాడు. అడ‌వి నుంచి తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో సిర్కా వారికి ఎదురు ప‌డ్డాడు. దీనితో అత‌ణ్ని కూడా చంపి, అత‌ని మృత‌దేహాన్ని అడ‌విలో ప‌డేశారు.

కింద‌టినెల 27వ తేదీన సిర్కా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇన్నాళ్లూ తాము అత‌ను కుటుంబంతో స‌హా ఊరెళ్లి ఉంటాడ‌ని అనుకున్నామ‌ని, ఇలా దారుణ‌హ‌త్య‌కు గురై ఉంటాడ‌ని ఊహించ‌లేద‌ని చెప్పారు. వెంట‌నే వారు స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను గుర్తించామ‌ని, వారిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు ఎస్పీ తౌఫిక్ తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here