జెండా దిమ్మెపై మ‌నిషి త‌ల‌: తెల్ల‌వారుజామున రోడ్డు ఊడ్చ‌డానికి వ‌చ్చిన వాళ్లు దాన్ని చూసి..

తెల్ల‌వారు జామున రోడ్డు ఊడ్చ‌డానికి చీపుర్లు ప‌ట్టుకుని చ‌లికి వ‌ణుకుతూ వ‌చ్చారు కొంద‌రు మున్సిప‌ల్ కార్మికులు. రోడ్డు ఊడ్చుతూ ప‌క్క‌నే ఉన్న జెండా దిమ్మె వైపు చూసి..భ‌యంతో బిక్క‌చ‌చ్చిపోయారు. చ‌లిలోనూ చెమ‌ట‌లు ప‌ట్టాయి.

కార‌ణం..జెండా దిమ్మెపై మ‌నిషి త‌ల క‌నిపించింది. త‌ల మాత్ర‌మే.. మొండెం లేదు. ఈ విష‌యాన్ని వెంట‌నే వారు స్థానికులతో పాటు పోలీసుల‌కూ స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. త‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది.

హ‌తుడిని స్థానిక ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ ర‌మేశ్‌దిగా గుర్తించారు. న‌ల్ల‌గొండ జిల్లాలోని క‌న‌గ‌ల్‌కు చెందిన ర‌మేశ్ ఇసుకను త‌ర‌లించే ట్రాక్ట‌ర్‌కు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వాడ‌ని తేలింది.

అత‌ను వివాహితుడు. కామెర్ల‌తో బాధ‌ప‌డుతున్న ర‌మేశ్.. నాటు మందు తెచ్చుకుంటాన‌ని ఇంట్లో చెప్పి ఆదివారం న‌ల్ల‌గొండ‌కు వ‌చ్చాడ‌ని, ఆ త‌రువాత ఆయ‌న మొబైల్ స్విచాఫ్ అయ్యింద‌ని కుటుంబీకులు చెబుతున్నారు.

ఆ స‌మ‌యంలోనే ర‌మేశ్ హ‌త్య‌కు గురై ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్య‌క్తులు రమేశ్‌ను కిరాతకంగా చంపి, తలను, మొండెంను వేరుచేశారు.

తలను తీసుకొచ్చి బొట్టుగూడలోని జెండాదిమ్మెపై ఉంచివెళ్లారు. త‌ల దొరికిన చోటికి సుమారు అర‌కిలోమీట‌ర్ దూరంలో ఉన్న భారత్‌ గ్యాస్‌ గోడౌన్‌ వద్ద రమేశ్‌ మొండేన్ని గుర్తించారు.

ఈ హత్యచేసింది ఎవరు, ఇందుకు దారితీసిన పరిస్థిలేమిటనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధమే రమేశ్‌ మరణానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here