తండ్రి, త‌మ్ముళ్ల‌ను పొలం వ‌ద్ద‌కు అర్జెంట్‌గా రావాలని ఫోన్ చేశాడు..వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టే!

ఆ దుర్మార్గుడికి ఇద్ద‌రు త‌మ్ముళ్లు. తండ్రి పంచి ఇచ్చే ఆస్తిలో వారికి వాటా ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే ఉద్దేశంతో దారుణ మార‌ణ‌కాండ సృష్టించాడు. తండ్రితో స‌హా త‌న ఇద్ద‌రు త‌మ్ముళ్ల‌నూ హ‌త‌మార్చాడు.

తెలంగాణ‌లోని అచ్చంపేట్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అచ్చంపేట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన భాస్కరయ్యకు మ‌ల్ల‌య్య‌, శ్రీ‌శైలం, రామ‌స్వామి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.

భాస్కరయ్య పేరు మీద రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని ముగ్గురు కుమారుల‌కు స‌మానంగా పంచి ఇవ్వ‌డానికి భాస్క‌రయ్య స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇది పెద్ద కుమారుడు మ‌ల్ల‌య్య‌కు న‌చ్చ‌లేదు. ఆస్తి మొత్తం త‌న‌కే చెందాల‌ని కొద్దిరోజులుగా తండ్రితో గొడ‌వ ప‌డుతుండేవాడు. దీనికి ఆయ‌న అంగీక‌రించ‌లేదు.

దీనితో అత‌ను తండ్రి స‌హా ఇద్ద‌రు సోద‌రుల‌ను హ‌త‌మార్చ‌డానికి కుట్ర ప‌న్నాడు. శనివారం రాత్రి పొలం వద్దకు రావాలని తండ్రి, ఇద్దరు తమ్ముళ్లను ఫోన్ చేసి పిలిచాడు.

ఒకరి త‌రువాత ఒక‌రుగా వెళ్లారు వారు. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టే న‌రికేశాడు. రాత్రికి రాత్రే ఆ గ్రామం నుంచి ప‌రార‌య్యాడు. ఆదివారం ఉదయం పొలానికి వ‌చ్చిన ఇత‌ర రైతులు మృతదేహాలను చూసి, భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తెల్కపల్లి మండల కేంద్రంలోని ఓ హోటల్ వద్ద టిఫిన్ చేస్తుండగా మ‌ల్ల‌య్య‌ను గుర్తించి, అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here