ఇంత పెద్ద లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి.. ఏమయ్యా ఏడుకొండలు..!

లంచం.. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా కూడా కాసులకు కక్కుర్తి పడతారు. అలా ఓ అధికారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏకంగా 23.20లక్షలు అతడి చేతుల్లోకి పడిన సమయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమిషనర్ ఏడుకొండలును అవినీతి నిరోధకశాఖ అధికారులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.

మలేషియాకు చెందిన ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ గంగవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ, నౌకాశ్రయాల్లో బెర్త్‌ల నిర్మాణం చేపట్టింది. వీటి నిమిత్తం 2010 నుంచి 2014 వరకు వాణిజ్య పన్నుల శాఖ నుంచి రూ.4.67 కోట్లు రావాల్సి ఉంది. ఈ ఫైల్ ఏడుకొండలు వద్దకు వచ్చింది. ఐటీడీ కంపెనీ న్యాయ సలహాదారు అయిన గోపాల్‌శర్మకు ఏడుకొండలుతో పరిచయం ఉండడంతో డీల్ కుదుర్చుకున్నారు. ఫైల్‌ను త్వరగా క్లియర్ చేస్తే రూ.25 లక్షలు ఇస్తామని చెప్పారు.

గోపాల్‌శర్మ, ఐటీడీ కంపెనీ డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణ కలిసి శుక్రవారం డబ్బులతో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. నగర శివారులోని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఏడుకొండలును కలిసి డబ్బులు ఇవ్వబోయారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.23.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే లంచం ఇవ్వబోయిన కంపెనీ అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here