34 సంవత్సరాలలో 71 బదిలీలు.. ఆరు నెలలు జీతం ఇవ్వకుండా రిటైర్.. నిజాయితీకిచ్చిన గౌరవం ఇది..!

మన దేశంలో నిజాయితీకి ఏ మాత్రం విలువనిస్తారో ఈయన ఉదంతం ఒక్కటి చాలు.. ఐఏఎస్ ఆఫీసర్ అయిన ప్రదీప్ కస్ని.. 34 సంవత్సరాలుగా ఈ దేశానికి ఎంతో సేవ చేశాడు.. కానీ ఆయన ఎదుర్కొంది 71 బదిలీలు.. ఒక్క చోట కూడా ఆయన నిజాయితీగా పని చేస్తుంటే ఓర్వలేకపోయేవారు అక్కడి రాజకీయనాయకులు.. అందుకే ఈ ఐఏఎస్ గారు అన్ని ఏళ్ళు.. అన్ని చోట్లకు మారారు. అంతేకాదు ఆయన ఇటీవలే రిటైర్ అయ్యారు. చివరి ఆరు నెలల పాటూ ఆయనకు జీతం కూడా ఇవ్వలేదట..!

అందుకు కారణం ఆయన చివరిసారిగా పని చేసిన డిపార్ట్మెంట్ గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ రికార్డుల్లోనే లేదట.. ఫిబ్రవరి 28 న తన 34 ఏళ్ల ఉద్యోగ జీవితానికి స్వస్థి పలికిన ఆయన కోర్టుకు ఆశ్రయించే దాకా ఆ విషయమే బయటకు రాలేదు. ఆయనను సర్వీసు చివరిలో హరియాణా ల్యాండ్‌ యూస్‌ బోర్డ్‌‌‌కు ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్డీగా)గా నియమించారు. అధికారికంగా ఆ బోర్డు ప్రభుత్వ రికార్డుల్లోనే లేదని ఆయనకు గత ఆరు నెలలుగా జీతం రాకుండాపోయింది.

ఆర్టీఐ ద్వారా పిటిషన్ దాఖలు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా మార్చి 8న నిర్ణయం తీసుకోనుంది. ల్యాండ్‌ యూస్‌ బోర్డుకు బదిలీ అయిన ప్రదీప్‌ కస్నీ, కార్యాలయంలో ఉద్యోగులు లేకపోవడం, అధికారిక పత్రాలు కనిపించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆర్టీఐ చట్టం ద్వారా పిటిషన్‌ వేశారు. 1984 హరియాణా సివిల్‌ సర్వీసెస్‌ బ్యాచ్‌కు చెందిన ప్రదీప్‌ అనంతరం ఐఏఎస్ అధికారిగా పదోన్నతి పొందారు. ప్రదీప్‌ భార్య కూడా ఐఏఎస్‌ అధికారిణి. ఆమె గతంలో గవర్నర్‌కు ఏడీసీ పనిచేసి గతేడాది పదవీ విరమణ చేశారు. ఏమైనా కానీ తన పోరాటం ఆగదని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here