ఒక్క పెన్‌తో విమానాన్నే దారి మ‌ళ్లించాడు!

బీజింగ్‌: ఎయిర్ చైనా విమానం ఒక‌టి దారి మ‌ళ్లింది. దీనికి కార‌ణం ఓ పెన్‌. ఫౌంటెయిన్ పెన్‌ను గ‌న్‌గా బెదిరించి, ఫ్లైట్ అటెండెంట్‌ను అదుపులోకి తీసుకున్నాడో వ్య‌క్తి. ఆ విమానాన్ని దారి మ‌ళ్లించాడు. చైనాలో చోటు చేసుకుందీ ఘ‌ట‌న‌. షెడ్యూల్ ప్ర‌కారం ఆదివారం ఉద‌యం 8: 40 గంట‌ల‌కు ఈ విమానం హ్యూన‌న్ ప్రావిన్స్‌లోని చాంగ్ఝా నుంచి బ‌య‌లుదేరి 11 గంట‌ల‌కు బీజింగ్‌కు చేరాల్సి ఉంది.

టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల‌కే ఓ ప్ర‌యాణికుడు ఫౌంటెయిన్ పెన్‌ను గ‌న్‌గా వీపున‌కు ఆన్చి, ఫ్లైట్ అటెండెంట్‌ను అదుపులోకి తీసుకున్నాడు. తాను చెప్పిన‌ట్టు విన‌క‌పోతే అత‌ణ్ని చంపేస్తాన‌ని బెదిరించాడు. దీనితో పైలెట్ ఆ వ్య‌క్తి చెప్పిన‌ట్టే చేశాడు. బీజింగ్ వెళ్లాల్సిన ఆ విమానాన్ని ఝెంగ్ఝౌ సిటీకి మ‌ళ్లించాడు. 10 గంట‌ల‌కు ఝెంగ్ఝౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

విమానం హైజాక్ అయింద‌నుకునే ఉద్దేశంతో అప్ప‌టికే ఝెంగ్ఝౌ విమానాశ్ర‌యంలో పెద్ద సంఖ్య‌లో పారా మిల‌ట‌రీ, పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రింప‌జేశారు. విమానం ల్యాండైన వెంట‌నే ప్ర‌యాణికులు కిందికి దిగారు. వారికి ఎలాంటి హాని క‌ల‌గ‌లేద‌ని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ చైనా వెల్లడించింది. మ‌ధ్యాహ్నానిక‌ల్లా ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అత‌ని వివ‌రాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here