అమితాబ్..మ‌రోసారి! జోధ్‌పూర్ నుంచి హుటాహుటిన ముంబైకి!

ముంబై: బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి అనారోగ్యానికి గుర‌య్యారు. రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో `థ‌గ్స్ ఆఫ్ ఇండియ‌న్స్‌` సినిమా షూటింగ్ సంద‌ర్భంగా ఆయ‌న నిస్స‌త్తువ‌తో కుప్ప‌కూలిపోయారు. వెంట‌నే ఆయ‌న‌ను ఛార్టెడ్ ఫ్ల‌యిట్‌లో జోధ్‌పూర్ నుంచి ముంబై లీలావ‌తి ఆసుప‌త్రికి త‌రలించారు. ఆయ‌న వెంట ఈ ఫ్ల‌యిట్‌లో ముగ్గురు డాక్ట‌ర్లు కూడా ఉన్నారు.

అమితాబ్ బ‌చ్చ‌న్‌తో పాటు అమీర్‌ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, ఫాతిమా స‌నా షేక్ ఈ మూవీలో న‌టిస్తున్నారు. య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా వారం రోజులుగా జోధ్‌పూర్‌లో కొన‌సాగుతోంది. త‌న షెడ్యూల్ మొద‌లు కావ‌డంతో అమితాబ్ బ‌చ్చ‌న్.. సోమ‌వారం రాత్రి జోధ్‌పూర్‌కు చేరుకున్నారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న సెట్స్‌కు చేరుకున్న కొద్దిసేప‌టికే తీవ్ర నీర‌సానికి గుర‌య్యారు. అమితాబ్ క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్టు ప్రొడక్ష‌న్ ఇన్‌ఛార్జి రాఘ‌వేంద్ర తెలిపారు. జోధ్‌పూర్‌లో ప్ర‌స్తుతం ఎండ‌లు తీవ్రంగా ఉంటున్నాయి. దీనితో క‌డుపునొప్పితో పాటు ఆయ‌న డీ హైడ్రేష‌న్‌కు గుర‌య్యార‌ని చెబుతున్నారు.

నెల‌ రోజుల వ్య‌వ‌ధిలో అమితాబ్.. అనారోగ్యానికి గురి కావ‌డం ఇది రెండోసారి. మంగ‌ళ‌వారం తాను థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ షూటింగ్‌లో పాల్గొంటున్న‌ట్టు తెల్ల‌వారు జామున ఆయ‌న ట్వీట్ కూడా చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here