మంట‌లు అంటుకున్న‌ది విశాఖ‌ప‌ట్నం-హ‌జ్రత్ నిజాముద్దీన్ ఏపీ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లోనే!

విశాఖ‌ప‌ట్నం నుంచి న్యూఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లిన ఏపీ రాజ‌ధాని సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు చెల‌రేగాయి. నాలుగు బోగీల‌కు మంట‌లు వ్యాపించాయి. హైటెన్ష‌న్ విద్యుత్ తీగ బోగిపై ప‌డ‌టం వ‌ల్ల తొలుత మంట‌లు చెల‌రేగాయి. అనంత‌రం- నాలుగు బోగీల‌కు వ్యాపించాయి.

ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణాపాయం సంభ‌వించ‌లేదు. ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని ప్రాథ‌మిక స‌మాచారం. విశాఖ‌ప‌ట్నం నుంచి హ‌జ్ర‌త్ నిజాముద్దీన్‌కు వెళ్తుండ‌గా.. మధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ స‌మీపంలో ఉన్న బిర్లా న‌గ‌ర్ రైల్వేస్టేష‌న్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వెంట‌నే రైలును అక్క‌డే నిలిపివేశారు.

బీ6 బీ7 బోగీలు మంట‌ల బారిన ప‌డిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌యాణికులను ఖాళీ చేయించారు. మంట‌లు అంటుకున్న వెంట‌నే ప‌లువురు ప్ర‌యాణికులు రైలు నుంచి కిందికి దూకారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రికి గాయాలైన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే రైల్వే ఉన్న‌తాధికారులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

అగ్నిమాప‌క సిబ్బంది మంట‌లను ఆర్పివేస్తున్నారు. గ్వాలియ‌ర్ స‌హా వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 15 ఫైరింజ‌న్ల‌ను ర‌ప్పించారు. మంట‌లు అంటుకున్న బోగీల‌ను వేరు చేశారు. మంట‌లు చెల‌రేగిన వెంట‌నే బోగీలో అందుబాటులో ఉన్న ఫాగ్ మిష‌న్‌ను వినియోగించిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం లేద‌ని చెబుతున్నారు. అప్ప‌టికే మంట‌లు మొత్తం వ్యాపించాయ‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here