తెలుగు రాష్ట్రాలకు జైట్లీ ఇచ్చింది ఇవే..!

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు అరుణ్ జైట్లీ మొండిచేయి చూపించారు. ఇప్పటికే దీని మీద కేంద్ర మంత్రులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరీ, రామ్మోహన్ నాయుడు కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలను పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. ఇంతకూ తెలుగు రాష్ట్రాలకు ఏమేమి కేటాయించారంటే…

ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.32కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, ఎన్‌ఐటీకి రూ.54కోట్లు, ఐఐటీకి రూ.50కోట్లు, ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు, ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.1,400 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు, డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌కు రూ.19.62కోట్లు ఇచ్చారు. అలాగే, పరిశ్రమలలకు వడ్డీ రాయితీ కోసం రూ.50 కోట్లు కేటాయించారు.

తెలంగాణ పరిశ్రమలకు వడ్డీ రాయితీ కోసం రూ.50 కోట్లు, నల్గొండ-లింగంగుంట మార్గంలో 129 కి.మీ. మేర ఎలక్ట్రికేషన్, పెద్దపల్లి-లింగంపేట మార్గంలో 83కి.మీ. మేర ఎలక్ట్రికేషన్ కోసం కేటాయించారు. కాగా, హైదరాబాద్‌ ఐఐటీకి రూ.75 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, సింగరేణికి రూ.2 వేల కోట్లు కేటాయించారు.

అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు ఇచ్చామో అదే విధంగా ఏపీకి కూడా ఇస్తామంటే ఎలా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కొత్త రాజధానిని ఏ రాష్ట్రమూ నిర్మించడం లేదని, లోటు బడ్జెట్‌తో రాష్ట్ర పాలనను ప్రారంభించామని తెలిపారు. దేశంలో ఏపీ తప్ప లోటు బడ్జెట్ ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. ఏపీ విభజన తరువాత నష్టపోయిందని, వెనకబడి ఉన్న ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రత్యేకంగా ప్యాకేజీ ఇచ్చి అయినా ఆదుకోండని చెబుతున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనకే ఉంటామని, అవసరమైతే రాజీనామా చేయమన్నా చేస్తామని చెప్పారు.

కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ ఈ బడ్జెట్ చాలా నిరాశ పరిచిందని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాలకు రైల్వే కేటాయింపులు భారీగా చేశారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్ణణంలో ‘మెట్రో’ కేటాయింపుల గురించి మాట్లాడలేదన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్ ఫామ్ ల ఆధునీకరణ వంటి చిన్న చిన్నవే ఏపీకి కేటాయించినట్టు కనబడిందని సుజనా చౌదరి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here