చంద్రగ్రహణం నరబలి కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు చెప్పింది కట్టుకథే..!

జనవరి 31 న చంద్రగ్రహణం రోజున ఉప్పల్ లో నరబలి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు క్యాబ్ డ్రైవర్ రాజశేఖరేనని పోలీసులు ధృవీకరించారు. మూఢనమ్మకాల కారణంగానే అతడు ఈ పని చేశాడని తెలిసింది. అయితే చిన్న పిల్లాడి విషయంలో మాత్రం పోలీసులకు కట్టు కథ చెప్పాడని తెలుస్తోంది.

కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం తిరిగి నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు. బోయిగూడలోని రోడ్డు పక్కన గుడిసెలోని చిన్నారిని అపహరించినట్టు చెప్పిన నిందితుడు, అనంతరం పాప తలను వేరుచేసి మొండాన్ని మేడిపల్లి ప్రతాపసింగారం శివారులోని మూసీ నదిలో పడేసినట్టు తెలిపాడు. అయితే, బోయిగూడలో చిన్నారిని అపహరించినట్టు పోలీసులకు ఆధారాలు లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోతే తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు. ఇప్పటిదాకా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో అతడు చెప్పినవన్నీ కట్టు కథలేనని పోలీసులకు అర్థమైపోయింది. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

రాజశేఖర్ ఇంట్లో లభ్యమైన రక్తపు మరకలు, చిన్నారి తలకు ఉన్న మరకలు ఒకరివేనని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యింది. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా మారినా, చిన్నారిని ఎక్కడి నుంచి అపహరించారు? మొండెం ఏమైంది? అనేవి మిస్టరీగానే మిగిలిపోయాయి. వీటికి సమాధానాలు లభిస్తే కానీ చిక్కుముడి వీడేలాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here