సంచలన నిర్ణయం తీసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్థుల కేసులను అప్పట్లో విచారించింది ఈయనే.. ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ఆయనకు ఇంకా పదవీ కాలం ఉంది.. ప్రస్తుతం ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ల‌క్ష్మీనారాయ‌ణ ఓ ర‌కంగా ప్ర‌కంప‌న‌ల‌నే లేపారు.

దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒక‌టి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తుల కేసును విచార‌ణ‌కు స్వీక‌రించ‌డం.. రెండు- ఒక‌ప్ప‌టి స‌మైక్యాంధ్ర‌ ప్ర‌తిప‌క్ష నేత‌, విభ‌జ‌న త‌రువాత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేసును విచారించాల‌ని హైకోర్టు ఆదేశించిన‌ప్ప‌టికీ.. త‌న వ‌ద్ద చాలినంత సిబ్బంది లేద‌ని చెబుతూ విచార‌ణ‌ను నిరాక‌రించ‌డం. ఈ రెండు కార‌ణాల వ‌ల్ల ల‌క్ష్మీనారాయ‌ణ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎప్ప‌టికీ గుర్తుండిపోతారు. ఇప్పుడాయ‌న మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు.

ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో అడిషనల్ డీజీగా పని చేస్తున్నారు. ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖలు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాజీనామాను ఆమోదించాల్సి ఉంది. రాజీనామా చేయడానికి ముఖ్య కారణం లక్ష్మి నారాయణ రాజకీయాల్లోకి రాబోతుండడమేనని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లోకి రాబోతున్నారని గతంలో కూడా ఒక సారి వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆ ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీ తీర్థాన్ని పుచ్చుకుంటార‌ని, ఆ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు వెళ్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆస్తుల కేసులో జ‌గ‌న్ 16 నెల‌ల పాటు జైల్లో గ‌డిపారు. జ‌గ‌న్ ల‌క్ష కోట్లు సంపాదించార‌నే ఆరోప‌ణ‌ల‌పై అప్ప‌టి సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ కేసు పెట్టారు. విచార‌ణ జ‌రిపారు. ఈ కేసు ద‌ర్యాప్తు జ‌ర‌గ‌బ‌ట్టి ఆరేడేళ్లు గ‌డుస్తోంది. ఇప్ప‌టికీ ఒక్క కేసు కూడా నిరూప‌ణ కాలేద‌నుకోండి అది వేరే విష‌యం.

మ‌హారాష్ట్ర క్యాడ‌ర్‌కు చెందిన ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌స్తుతం ఆయ‌న ముంబై అద‌న‌పు డీజీపీగా ప‌నిచేస్తున్నారు. రాజ‌కీయ ఎంట్రీ నిజ‌మే అయితే ఆయ‌న వైఎస్ఆర్ సీపీలో ఎలాగూ చేర‌లేరు. ప్ర‌స్తుతం ఆయ‌న ముందున్న రాజ‌కీయ పార్టీలు రెండే. టీడీపీ లేదా బీజేపీ. ఈ రెండింట్లో ఏదో ఒకదాన్ని ఆయ‌న ఎంచుకోక త‌ప్ప‌దు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో ల‌క్ష్మీనారాయ‌ణ‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇది కాద‌న‌లేని స‌త్యం. ల‌క్ష్మీనారాయ‌ణే అడ్డుప‌డ‌కుండా ఉండి ఉంటే చంద్ర‌బాబు ఆస్తుల కేసును సీబీఐ విచార‌ణ‌కు స్వీక‌రించి ఉండేదని అప్ప‌ట్లోనే వార్త‌లొచ్చాయి. రెండో ఆప్ష‌న్ బీజేపీ.

మ‌హారాష్ట్ర క్యాడ‌ర్ అధికారిగా అక్క‌డ అధికారంలో ఉన్న బీజేపీతోనూ ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలే ఉన్నాయ‌ని అక్క‌డి మీడియా చెబుతోంది. ఒక‌వేళ ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీలో చేరితే.. ఆ పార్టీ రాష్ట్రశాఖ‌లో కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. ఎన్నిక‌ల‌కు ఇంకా ఓ ఏడాది స‌మ‌యం కూడా మిగిలి ఉంది. ఈ గ‌డువులోగా ఆయ‌న‌ను ఏపీలో పార్టీ ప‌గ్గాల‌ను అప్ప‌గిస్తే ఎంతో కొంత మేలు ఉంటుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here