నాన్న కూల్‌డ్రింక్ ఇస్తే.. ఆనందంగా తాగిందా చిన్నారి! అందులో విషం క‌లిపాడ‌ని ఊహించ‌లేక‌పోయింది!

ఓ తండ్రి హంత‌కుడి అవ‌తారం ఎత్తాడు. త‌న క‌న్న కూతురికి పురుగుల మందు ఇచ్చి హ‌త‌మార్చాడు. తానూ అదే పురుగుల మందును తాగి, ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న‌లో ఆ కుమార్తె మ‌ర‌ణించ‌గా..ఆ వ్య‌క్తి మాత్రం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం కుటుంబ క‌ల‌హాలేన‌ని చెబుతున్నారు.

విషాద‌క‌ర ఘ‌ట‌న గుంటూరు జిల్లా విజ‌య‌పురి సౌత్‌లో చోటు చేసుకుంది. జిల్లాలోని మాచర్ల మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వెంకట్రావుకు అలుగురాజుపల్లి గ్రామానికి చెందిన పద్మతో తొమ్మిదేళ్ల కింద‌ట పెళ్ల‌యింది. ఎనిమిదేళ్లుగా అదే గ్రామంలో భార్య‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. వారికి ఓ పాప‌. పేరు ధ‌న‌ల‌క్ష్మి.

స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఆమె మూడో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు కొన‌సాగుతున్నాయి. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన వెంక‌ట్రావు కుమార్తెతో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

పాఠ‌శాల నుంచి ధ‌న‌ల‌క్ష్మిని పిలుచుకుని విజయపురిసౌత్‌కు వెళ్లాడు. అక్క‌డ ధ‌న‌ల‌క్ష్మికి కూల్‌డ్రింక్‌లో పురుగుల‌ మందు క‌లిపి తాగించాడు. తాను కూడా అదే మందు తాగాడు. ఇద్ద‌రూ అప‌స్మార‌క స్థితికి చేరుకున్నారు.

వారిని గ‌మ‌నించిన స్థానికులు వెంకట్రావు, ధనలక్ష్మిని హిల్‌ కాలనీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ధనలక్ష్మి మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీక‌రించారు.

వెంకట్రావుకు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్స కోసం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై మాచ‌ర్ల రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here