ఒక చెవి పోతే ..మరో చెవిని అభివృద్ధి చేశారు డాక్టర్లు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ సైనికురాలు..తన ఎడమ చెవిని పూర్తిగా కోల్పోయింది. ప్రమాదంలో తెగిన చెవికి ఇన్ఫెక్షన్ సోకడంతో.. దాన్ని తొలగించాల్సి వచ్చింది. అదే సమయంలో కృత్రిమ చెవిని అభివృద్ధి చేశారు. ఆమె కుడిచెయ్యి కండ, చర్మంతో మరో చెవిని అభివృద్ధి చేశారు.
ఆమె చెయ్యిలోనే దాన్ని అభివృద్ధి చేయడం విశేషం. తాము అభివృద్ధి చేసిన చెవిని బుధవారం సాయంత్రం ఆమె అమర్చారు కూడా. ఆ సైనికురాలి పేరు షమిక బుర్రగె. టెక్సాస్‌లో నివసిస్తోంది. అమెరికా సైనంలో ఆమె పనిచేస్తోంది. 19 సంవత్సరాల వయస్సులో సంభవించిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ఎడమ చెవిని కోల్పోయారు.
దీనితో టెక్సాస్ ఎల్ పాసోలోని విలియమ్ బ్యూమోంట్ ఆర్మీ మెడికల్ సెంటర్ డాక్టర్లు ఓ కృత్రిమ చెవిని అభివృద్ధి చేశారు. షమిక కుడి చెయ్యిలోనే దాన్ని తయారు చేశారు. బుధవారం ప్లాస్టిక్ సర్జరీ చేసి.. ఆ చెవిని షమికకు అతికించారు. ఆపరేషన్ విజయవంతమైందని ఆర్మీ మెడికల్ సెంటర్ సర్జన్ లెప్టినెంట్ కల్నల్ ఓవెన్ జాన్సన్ తెలిపారు.
2016లో షమిక తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో మిస్సిస్సిపి నుంచి ఫోర్ట్ బ్లిస్‌కు వస్తుండగా.. కారు ప్రమాదానికి గురైంది. 700 మీటర్ల పాటు రోడ్డుకు రాజుకుంటూ వెళ్లిన కారు ఆ తరువాత పలుమార్లు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో షమిక చెవి పూర్తిగా ఛిద్రమైంది. స్పైనల్ ఫ్రాక్చర్లు ఏర్పడ్డాయి.