నా సోదరుడిని చంపేశారన్న మమ్ముట్టి..!

మ‌తి స్థిమితం లేని ఓ బిచ్చ‌గాడి చేతులు క‌ట్టివేసి దారుణంగా కొట్టారు కొంద‌రు యువ‌కులు. అత‌నితో సెల్ఫీ దిగి ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అట్ట‌ప్పాడి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బిచ్చ‌మెత్తుకుంటూ, నిలువ నీడ లేకుండా, చెట్ల కింద నిద్రించే మ‌తి స్థిమితం లేని వ్య‌క్తి అత‌ను. పేరు మ‌ధు. చోరీ చేస్తున్నాడ‌నే కార‌ణంతో అదే గ్రామానికి చెందిన ఏడుమంది యువ‌కులు అత‌ణ్ణి ప‌ట్టుకుని చేతులు క‌ట్టేశారు. ఇష్టానుసారంగా కొట్టారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనపై మలయాళ నటుడు మమ్ముట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

అతను ఆదివాసి కాదు. నా సోదరుడు లాంటి వాడు. దుండగులు నా సోదరుడిని చంపేశారు. మనిషిగా ఆలోచిస్తే చనిపోయిన మధు మీకో సోదరుడిగా, కుమారుడిగా కన్పిస్తాడు. ఇంకా చెప్పాలంటే అతను మనలాగే పౌరుడు. అతనికీ హక్కులు ఉంటాయి. ఆకలి కోసం దొంగతనం చేసేవారిపై దొంగ అనే ముద్రవేయకూడదు. పేదరికాన్ని సమాజమే సృష్టించింది. కారణం ఏదైనా ఓ మనిషి మరో మనిషిపై దాడి చేయడం తప్పు. క్షమించు మధు అంటూ మమ్ముట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తప్పుడు పనులు చేసిన ఎంతో మందిని వదిలేసి.. ఇలా అమాయకుడిని చంపడం ఏ మాత్రం న్యాయమా అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here