పతంజ‌లి డిమాండ్‌: గంజాయిని ఔష‌ధాల్లో వాడ‌తార‌ట‌! అమ్మ‌కాల‌ను చ‌ట్ట‌బ‌ద్ధం చేయాల‌ట‌

యోగాగురు రామ్‌దేవ్ బాబాకు చెందిన ప‌తంజ‌లి గ్రూపు సంస్థలు శుక్ర‌వారం ఓ విచిత్రమైన ప్ర‌క‌ట‌న చేసింది. గంజాయిలో ఔష‌ధ గుణాలు మెండుగా ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింది.

తాము దాన్ని ఔష‌ధాల త‌యారీలోకి వినియోగిస్తామ‌ని, గంజాయి అమ్మ‌కాల‌ను చ‌ట్ట‌బ‌ద్ధం చేయాల‌నీ డిమాండ్ చేసింది.

ఈ డిమాండ్ చేసింది కూడా మ‌రెవ‌రో కాదు. రామ్‌దేవ్ బాబాకు వెన్నుముక‌గా చెప్పుకొనే బాల‌కృష్ణ‌. ప్రాచీన కాలంలో గంజాయి మొక్కలను వైద్య అవసరాల కోసం ఉపయోగించేవారని, ఎన్నో రోగాలను నయం చేసే శ‌క్తి గంజాయికి ఉంద‌నీ చెప్పారు.

గంజాయిలోని ఉపయోగాలను ప్రజలకు ఔష‌ధాల రూపంలో అందిస్తామ‌ని చెప్పారు. హరిద్వార్‌లోని పతంజలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ లో 200 మంది శాస్త్రవేత్తలు దేశీయ మొక్కలు, వాటి ప్రయోజనాలు, వైద్య అవసరాలపై పరిశోధనలు చేస్తున్నార‌ని అన్నారు.

విదేశాల్లో ఈ గంజాయి చట్టబద్దమైనప్పటికీ.. భారత్ లో ఇది చట్ట వ్యతిరేకంగా ఉంద‌ని, దీన్ని చ‌ట్ట‌బ‌ద్ధం చేయాల‌ని చెప్పారు. అమెరికాలో గంజాయి విక్ర‌యాల ద్వారా ఏటా 800 కోట్ల రూపాయ‌ల‌ను ఆర్జిస్తున్నార‌ని చెప్పారు.

విషకారకమైన పదార్ధాలను తొలగించి ఉపయోగపడే విధంగా అందిస్తామని.. అందుకు కావాల్సిన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here