బంధుమిత్రులు, వీధిలో ఉండే వారికి గ్రాండ్ పార్టీ ఇచ్చిన తండ్రి..కుమారుడు పాస్ అయ్యాడ‌ని కాదు..!

పరీక్షల్లో తమ పిల్లలు ఉత్తీర్ణులైతే చుట్టుపక్కల వాళ్లని, బంధువులను ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చే తల్లిదండ్రులను చూశాం. ఫెయిల్ అయితే.. మంద‌లిస్తారు. కొడ‌తారు, తిడ‌తారు. వీడెక్క‌డ ఏ అఘాయిత్యం చేసుకుంటాడోన‌నే భ‌యంతో.. బుజ్జ‌గిస్తారు. అంతేగానీ-ఇలా గ్రాండ్ పార్టీ ఇచ్చే తండ్రుల‌ను మాత్రం ఇప్ప‌టిదాకా చూడ‌లేదు. ఆ కొర‌త తీరిన‌ట్ట‌యింది ఈ ఘ‌ట‌న‌తో.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌కు చెందిన సురేంద్ర కుమార్ కాంట్రాక్ట‌ర్‌. అత‌ని కుమారుడు అశు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాడు. తండ్రి ఎక్క‌డ కొడ‌తాడో అనే భ‌యంతో ఇంటికి వ‌చ్చిన అత‌నికి సురేంద్ర కుమార్ పెద్ద షాక్ ఇచ్చాడు. కుమారుడు ఫెయిల్ అయ్యాడ‌ని తెలుసుకోగానే.. అలాంటిలాంటి పార్టీ ఇవ్వ‌లేదు. బాణాసంచా తీసుకొచ్చి మ‌రీ కాల్చాడు.

ఇంటి ముందు టెంటు వేశాడు. అయిదారు ర‌కాల పిండి వంటల‌తో ఘ‌నంగా విందు ఏర్పాటు చేశాడు. స్నేహితులు, బంధువులు, వీధిలో వారంద‌ర్నీ పిలిచి భోజనం పెట్టాడు. అదేంట‌ని అడిగితే.. మంచి స‌మాధానం ఇచ్చారాయ‌న‌. ఫలితాలు అంత ముఖ్యం కాద‌ని, త‌న కుమారుడు చదవనందుకు ఫెయిల్‌ అవ్వలేదని అన్నాడు. అశు ప‌రీక్ష‌ల కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని తానే దానికి సాక్ష్య‌మ‌ని చెప్పాడు. పరీక్షలకు మించి జీవితంలో ఇంకా ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయని అన్నారు.

ఫెయిల్‌ అయ్యాడనే కోపంతో కొడితే వాడేదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎలా? ఎదురు ప్ర‌శ్న వేశారు. పార్టీ ఇచ్చి వాడిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాన‌ని అన్నారు. పిల్లలందరికీ తాను ఒక్కటే చెప్పద‌ల‌చుకున్నాన‌ని, పరీక్షలే ఆఖరి పరీక్షలు అనుకోవద్దు. అంతకంటే జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉందని హిత‌వు ప‌లికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here