కోచింగ్ సెంట‌ర్‌కు వెళ్లి ఫ్రెండ్‌తో తిరిగొస్తున్న అమ్మాయిపై..!

న‌లంద‌. బీహార్‌లోని ఓ జిల్లా పేరు ఇది. చ‌రిత్ర పుట‌ల్లో దీనికి ఉన్న ఈ పేరుకు ప్ర‌త్యేక స్థానం. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్ సొంత జిల్లా కూడా. అలాంటి జిల్లాలో అత్యంత అమాన‌వీయ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. కోచింగ్ సెంట‌ర్‌కు వెళ్లి త‌న స్నేహితుడితో తిరిగి ఇంటికి వెళ్తోన్న ఓ యువ‌తిని అడ్డ‌గించారు కొంద‌రు యువ‌కులు.

ఫ్రెండ్‌ను కొట్టి, ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. లైంగిక దాడికి దిగారు. చుట్టుముట్టి, ఆ యువ‌తిని లైంగికంగా వేధించారు. దాన్ని వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీహార్ న‌లంద జిల్లాలోని హిల్సా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ లైంగిక వేధింపుల‌కు సంబంధించిన వీడియో ఒక‌టి న‌లంద జిల్లాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. బాధితురాలు ఎప్ప‌ట్లాగే త‌న గ్రామానికి స‌మీపంలోని దివాక‌ర్ న‌గ‌ర్‌లో ఓ కోచింగ్ సెంట‌ర్‌కు వెళ్లి త‌న గ్రామానికే చెందిన స్నేహితుడితో తిరిగి వ‌స్తుండ‌గా.. ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

దివాక‌ర్ న‌గ‌ర్ శివార్ల నుంచి బాధితురాలి గ్రామానికి వెళ్ల‌డానికి కొంత‌దూరం కాలిన‌డ‌క‌న వెళ్లాల్సి ఉంటుంది. ఇద్ద‌రూ క‌లిసి న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని అయిదుమంది యువ‌కులు వారిని అడ్డుకున్నారు. లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఆమె స్నేహితుడిని కొట్టి, ప‌క్క‌కు ఈడ్చి ప‌డేశారు. ఆ యువ‌తిని లైంగికంగా వేధించారు.

వారిలో ఓ యువ‌కుడు.. దీన్నంత‌టినీ సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘ‌ట‌న త‌రువాత బాధితురాలు హిల్సా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ఆ అయిదుమందిని గుర్తించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని న‌లంద జిల్లా ఎస్పీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here