రోడ్డు ప‌క్క‌న దొరికిన సూట్‌కేస్‌ను తెరిచి చూసి..భ‌యంతో బిగుసుకుపోయారు!

చండీగ‌ఢ్‌: ఢిల్లీ-జైపూర్ జాతీయ ర‌హ‌దారి అది. దానికి ఆనుకునే చిన్న కాలువ లాంటి నిర్మాణం. అందులో ఓ ఖ‌రీదైన, భారీ సూట్‌కేస్‌. అటుగా వెళ్లిన ఒక‌రిద్ద‌రు వాహ‌న‌దారుల క‌న్ను దానిపై ప‌డింది. కొత్త సూట్‌కేస్ కావ‌డంతో.. దాన్ని చేజిక్కించుకోవాల‌నుకున్నారు.

త‌మ బైక్‌ను రోడ్డు ప‌క్క‌న పార్క్ చేసి, సూట్‌కేస్ వ‌ద్ద‌కు వెళ్లారు. దాన్ని కాస్త ఎత్త‌గానే బ‌రువుగా అనిపించింది. స్వ‌ల్పంగా దుర్వాస‌న కూడా వారి ముక్కుపుట‌ల‌కు సోకింది. కాస్త భ‌యం భ‌యంగానే దాన్ని తెరిచి చూశారు. విగ్ర‌హాల్లా మారిపోయారు.

నోటి మాట కూడా రాలేదు. భ‌యంతో బిగుసుకుపోయారు. కార‌ణం.. ఓ యువ‌తి మృతదేహం ఆ సూట్‌కేస్‌లో క‌నిపించడ‌మే. హ‌ర్యానాలో ఢిల్లీ-జైపూర్ రాజ‌ధాని జాతీయ ర‌హ‌దారిపై బావ‌ల్ ప‌ట్ట‌ణ స‌మీపంలోని ఓఢి గ్రామ శివార్ల‌లో ఈ సూట్‌కేస్ వాహ‌న‌దారుల‌కు క‌నిపించింది.

వెంట‌నే- వారు బావ‌ల్ పోలీస్‌స్టేష‌న్‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థానికి చేరుకున్న పోలీసులు సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్ కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఆ యువ‌తిది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త‌మార్చిన‌ట్లు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. మృత‌దేహంపై గాయాల గుర్తులున్నాయి. ఓఢి గ్రామ‌స్తుల‌ను విచారించారు. ఆమె స్థానికురాలు కాద‌ని తేలింది.

ఆమె వేసుకున్న వ‌స్త్ర‌ధార‌ణ‌ను బ‌ట్టి చూస్తే.. స్థానికురాలు కాద‌ని స్థానికులు చెబుతున్నారు. యువ‌తి మృత‌దేహం ల‌భించిన ఓఢి గ్రామం.. రాజ‌స్థాన్ స‌రిహ‌ద్దుల‌కు ఆనుకుని ఉండే రేవా సిటీకి 14 కిలోమీట‌ర్లు, హ‌ర్యానాలోని గుర్‌గావ్‌కు 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. మొద‌ట ఈ రెండు చోట్ల ద‌ర్యాప్తు చేప‌డ‌తామ‌ని పోలీసులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here