గాలి ఆడ‌ని, వెలుగు సోక‌ని ఆ డ్రైనేజీ పైప్ లైన్‌లో నీడ‌గా క‌నిపిస్తోన్న‌ది..!

లాస్ ఏంజిలిస్‌: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్నది ఓ డ్రైనేజీ పైప్‌లైన్‌. ఆ పైప్‌లైన్‌లో ఎడ‌మ వైపు నీడ‌గా క‌నిపిస్తున్న‌ది ఏ దెయ్య‌మో అనుకుంటే పొర‌పాటే. అక్క‌డ నిల్చున్న‌ది ప‌దేళ్ల పిల్లాడు. గాలి ఆడ‌ని, వెలుగు సోక‌ని ఆ పైప్‌లైన్‌లో చిక్కుకుపోయాడా పిల్లాడు. ఆ చిమ్మ‌చీక‌టిలో చిక్కుకుపోయిన బాలుడిని వెద‌క‌డానికి స‌హాయక సిబ్బంది.. కెమెరాను ఉప‌యోగించారు.

దానివ‌ల్ల వ‌చ్చిన వెలుగే అది. అందుకే- ఆ ఫొటో అంత భ‌యాన‌కంగా క‌నిపిస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ పిల్ల‌వాడు 12 గంట‌ల పాటు ఆ డ్రైనేజీ పైప్‌లోనే చిక్కుకుపోయాడు. చివ‌రికి పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ర‌క్షించాయి. ఆ బాలుడి పేరు జెస్సీ హెర్నాండెజ్‌.

ఆదివారం సాయంత్రం 4 గంట‌ల స‌మయంలో త‌న తోటి స్నేహితుల‌తో ఆడుకుంటూ, పొర‌పాటున తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో ప‌డిపోయాడు. అత‌ని అదృష్టం బాగుండి.. ఆ డ్రైనేజీలో మురుగు నీరు పార‌ట్లేదు. మ్యాన్‌హోల్‌లో ప‌డిపోయే స‌మ‌యంలో దేన్నో ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఆ స‌మ‌యంలో క‌నిపించిన చేతి గుర్తులే ఆ బాలుడ్ని ర‌క్షించాయి.

ఎందుకంటే- జెస్సీ హెర్నాండెజ్ డ్రైనేజీ పైప్‌లైన్‌లో ప‌డిపోయాడ‌ని నిర్ధారించుకోవ‌డానికి ఆ చేతి గుర్తులే కార‌ణం అయ్యాయి. స్నేహితులు కూడా దీన్ని నిర్ధారించ‌లేక‌పోయారు. 25 అడుగుల పొడవు ఉన్న పైప్‌లైన్ అది. సుమారు ఎనిమిది అడుగుల చుట్టు కొల‌తతో ఉందా పైప్‌లైన్‌. అరిచినా బ‌య‌టికి శ‌బ్దం వినిపించ‌దు.

ఇంత పెద్ద పైప్‌లైన్‌లో జెస్సీ ఎక్క‌డున్నాడో తెలుసుకోవ‌డానికి పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ప్ర‌త్యేక కెమెరాల‌ను వినియోగించారు. వాటి ద్వారా అత‌ను ఎక్క‌డ ఉన్నాడో తెలుసుకోగ‌లిగారు. తెల్ల‌వారు జామున 4 గంట‌ల‌కు జెస్సీని సుర‌క్షితంగా అగ్నిమాప‌క సిబ్బంది బ‌య‌టికి తీసుకొచ్చారు. కెమెరా కోసం పోలీసులు 1000 అడుగుల పొడ‌వు ఉన్న కేబుల్‌ను వినియోగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here