నుదుటిపై క‌ణితి వ‌చ్చింద‌నుకున్నారు! ప‌రీక్షించిన డాక్ట‌ర్లు ఉలిక్కిప‌డ్డారు! ఒక్క‌రోజు కూడా బ‌త‌క‌డ‌న్నారు! 

వైద్య‌శాస్త్రంలో కొన్ని అద్భుతాలు ఎప్పుడూ చోటు చేసుకుంటూనే ఉంటాయి. చ‌నిపోయిన మ‌నిషి లేచి నిల్చోవ‌డం, ఇక బ‌త‌క‌డు అనుకున్న వాళ్లు లేచి భేషుగ్గా మ‌న క‌ళ్ల‌ముందే తిరుగుతుండ‌టం వంటి ఘ‌ట‌న‌లు ఒక్కో సంద‌ర్భంలో డాక్ట‌ర్ల‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.

ఈ ఘ‌ట‌న కూడా అలాంటిదే. నుదురుపై మెద‌డుతో జ‌న్మించాడో బాలుడు. నుదురుపై మెద‌డు అంటే.. బాబు పుర్రెభాగం ఎద‌గ‌లేద‌న్న‌మాట‌. ఫ‌లితంగా- బాబు మెద‌డు నుదుటిపై క‌ణితిలాగా ఏర్ప‌డింది.

బాబును ప‌రీక్షించిన డాక్ట‌ర్లు.. ఒక్క‌రోజు కూడా బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌ని కూడా తేల్చేశారు. అలాంటి ఆ చిన్నారికి ఇప్పుడు ప‌దేళ్లు. ఈనెల 11వ తేదీన త‌న 10వ పుట్టిన‌రోజును గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

ఈ ఘ‌ట‌న ఇంగ్లండ్‌లోని వార్విక్‌షైర్‌లో చోటు చేసుకుంది. అత‌ని పేరు జేమీ డేనియ‌ల్‌. 2008 జ‌న‌వ‌రి 11వ తేదీన వార్విక్‌షైర్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో జ‌న్మించాడు.

పుట్టిన వెంట‌నే బాబును ప‌రీక్షించిన డాక్ట‌ర్లు నుదుటిపై క‌ణితి ఏర్ప‌డింద‌ని అనుకున్నారు. ప‌రీక్షించిన త‌రువాత షాక్ అయ్యారు. అది మెద‌డు. మెద‌డులో మూడోవంతు నుదుటిపైకి వ‌చ్చేసింది.

బాబు పుర్రెభాగం స‌రిగ్గా ఎద‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని, ఒక‌రోజు కూడా బ‌త‌క‌డ‌ని తేల్చారు. ఐసీయూలో చేర్చ‌డం కూడా వృధా అన్నారు డాక్ట‌ర్లు.

ఆ బాధ‌తోనే బాబును ఇంటికి తీసుకెళ్లారు. మెద‌డు బ‌య‌టికి క‌నిపిస్తుండ‌టం ఒక్క‌టే త‌ప్ప‌.. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్యలూ లేక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

కొద్దిరోజుల త‌రువాత బ‌ర్మింగ్‌హామ్ చిల్డ్ర‌న్స్ ఆసుప‌త్రిలో చూపించ‌గా.. ఆప‌రేష‌న్ చేశారు. అది విజ‌య‌వంతమైంది. దీనితో ఆ బాబు ఆనందంగా జీవించ‌గ‌లుగుతున్నాడు. మొన్న జ‌న‌వ‌రి 11న త‌న 10వ పుట్టిన‌రోజును గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here