పీట‌ల‌పై కోటి రూపాయ‌ల క‌ట్నం అడిగాడు! పెళ్లి దుస్తుల్లోనే పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి కేసు పెట్టింది

అచ్చం 80వ ద‌శ‌కాల్లో వ‌చ్చిన‌ సినిమాల్లోలాంటి సీన్ ఇది. స‌రిగ్గా తాళి క‌ట్ట‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు కోటి రూపాయ‌ల క‌ట్నం అడిగాడు వ‌రుడు. పెళ్లి పీట‌లపై కూర్చుని క‌ట్నంలో నుంచి త‌నకు రావాల్సిన బాకీ ఏద‌ని నిల‌దీశాడు.

అది ఇస్తే గానీ తాళి క‌ట్ట‌బోనంటూ భీష్మించాడు. వ‌రుడి తీరుతో షాక్‌కు గురై, పెళ్లి పీట‌ల మీద త‌ల‌వంచుకు కూర్చుని, గుడ్ల‌ల్లో నీళ్లు కుక్కుకోలేదా వ‌ధువు. వ‌రుడిని బ‌తిమిలాడుతూ, గ‌డ్డం, కాళ్లూ ప‌ట్టుకుని బుజ్జ‌గించ‌నూ లేదు ఆమె త‌ల్లిదండ్రులు. నేరుగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు.

వ‌రుడిపై ఫిర్యాదు చేశారు. లిఖిత‌పూర‌కంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు.. వ‌రుడు, అత‌ని త‌ల్లిదండ్రుల‌పై కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని ఢెంక‌నాల్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని మొతుంగా తెహ‌సీల్ ప‌రిధిలోని నాధారా గ్రామానికి చెందిన స్వ‌ర్ణ‌మాయీ నాయ‌క్ అనే యువ‌తికి అదే జిల్లాలోని క‌రాడ‌గడియా గ్రామానికి చెందిన శాంతిస్వ‌రూప్ దాస్‌తో వివాహం నిశ్చ‌య‌మైంది.

శాంతి స్వ‌రూప్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. వధువు తల్లిదండ్రులు కాస్త డ‌బ్బున్న‌వారే. దీనితో కోటి రూపాయ‌ల‌ను క‌ట్నంగా ఇవ్వ‌డానికి అంగీక‌రించారు.

మూడు విడ‌త‌ల్లో 75 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇచ్చేశారు కూడా. పెళ్లి నాటికి మ‌రో 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇవ్వాల్సి ఉంది. ఆ మొత్తం స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో ఇవ్వ‌లేక‌పోయారు.

దీనితో కోటి రూపాయ‌ల‌ను మొత్తంగా ఇస్తే గానీ తాళి క‌ట్ట‌బోనంటూ పెళ్లి పీట‌ల మీదే భీష్మించాడు శాంతిస్వ‌రూప్ దాస్‌. స్వ‌ర్ణ‌మాయీ నాయ‌క్ తండ్రిని పిలిచి.. మొత్తం డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే త‌న కుమారుడు తాళి క‌ట్ట‌డ‌ని హెచ్చ‌రించారు.

అత‌ని తీరుతో చిర్రెత్తుకుపోయిన స్వ‌ర్ణ‌మాయీ నాయ‌క్‌.. నేరుగా మొతుంగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి వ‌రుడిపై లిఖిత‌పూర‌కంగా ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పెళ్లిమంట‌పానికి చేరుకునేలోగా.. శాంతిస్వ‌రూప్ దాస్ జంప్ అయిపోయాడు. అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here