తెల్లారితే పెళ్లి: ముందురోజు రాత్రే వ‌ధువు అదృశ్యం: ఆమె చెల్లెలితో మ్యారేజ్ ఫిక్స్‌..దీని ఫ‌లితం?

రెండు కుటుంబాల మ‌ధ్య మాటా-ముచ్చ‌ట అన్నీ అయిపోయాయి. తెల్లారితే పెళ్లి. వ‌రుడు, అత‌ని త‌ర‌ఫు బంధుమిత్రులంద‌రూ క‌ల్యాణ‌మంట‌పానికి చేరుకున్నారు. పెళ్లి సంద‌ట్లో మునిగిపోయారు. భోజ‌నాలు సిద్ధ‌మ‌య్యాయి.

వ‌ధువు, ఆమె త‌ర‌ఫు బంధువుల‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డానికి రెడీ అయ్యారు. వ‌ధువు, ఆమె త‌ర‌ఫు బంధువుల కోసం వెయిటింగ్‌. గ‌డియారంలో ముల్లు తిరుగుతోంది గానీ.. వాళ్లు మాత్రం రాలేదు. గంట‌లు గ‌డిచిపోయినా వారు వ‌స్తోన్న జాడ కూడా లేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్‌.

దీనితో కంగారుప‌డ్డ వ‌రుడు, అత‌ని త‌ర‌ఫు బంధువులు క‌లిసి.. వ‌ధువు ఊరికెళ్లారు. అక్క‌డికెళ్లాక వారికి షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఈ పెళ్లి ఇష్టం లేక.. వ‌ధువు ఇంట్లోంచి పారిపోయింద‌ట‌.

పెళ్లి మంట‌పానికి బ‌య‌లుదేరాల్సిన రెండు గంట‌ల ముందు నుంచీ వ‌ధువు క‌నిపించ‌ట్లేద‌ట‌. తెల్లార‌గా పెళ్లి పెట్టుకుని, త‌మ కుమార్తె వెళ్లిపోవ‌డంతో ఎలా చెప్పాలో తెలియ‌క, ఇంట్లోనే ఉన్నామ‌నీ అన్నారు.

అయిందేదో అయింద‌నుకుని.. వ‌ధువు చెల్లెలితో పెళ్లి ఫిక్స్ చేశారు. అప్ప‌టిక‌ప్పుడు ఆమెను పెళ్లి కుమార్తెగా చేశారు. రెండు కుటుంబాల వారూ పెళ్లి మంట‌పానికీ బ‌య‌లుదేరారు.

అక్క‌డే ఇంకో ట్విస్ట్‌. తెల్లారిన త‌రువాత చూస్తే.. వ‌రుడు లేడు. అత‌నూ అదృశ్యం అయ్యాడు. దీనికి కార‌ణం.. వ‌ధువు చెల్లెలిని పెళ్లి చేసుకోవ‌డం ఇష్టంలేక అత‌ను కూడా పెళ్లి మంట‌పం నుంచి పారిపోయాడు.

ఈ ఘ‌ట‌న కర్ణాట‌క‌లోని కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మాలూరు తాలూకాలో ఉన్న చెన్నెక‌ల్లు గ్రామానికి చెందిన గురేష్ అనే యువ‌కుడితో బంగారుపేటే తాలూకాలోని న‌ర్న‌హ‌ళ్లి గ్రామానికి చెందిన దీపిక (పేరుమార్చాం)తో పెళ్లి నిశ్చ‌య‌మైంది.

మాలూరు ప‌ట్ట‌ణంలోని ప‌ద్మావ‌తి క‌ల్యాణ‌మంట‌పంలో ఆదివారం ఉద‌యం 7:30 గంట‌ల‌కు త‌లంబ్రాలు. దీనికోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. శ‌నివారం సాయంత్రానికి సుమారు 700 మందికి పైగా బంధువుల‌, మిత్రులు మాలూరుకు చేరుకున్నారు.

రాత్రి 11 గంటలైన‌ప్ప‌టికీ దీపిక‌, ఆమె త‌ర‌ఫు బంధువులెవ‌రూ రాక‌పోవ‌డంతో కంగారు ప‌డ్డారు గురేష్ బంధుమిత్రులు. వెంట‌నే వారు న‌ర్న‌హ‌ళ్లికి వెళ్లి చూడ‌గా.. అస‌లు విష‌యం తెలిసింది. దీనితో వారు దీపిక చెల్లెలితో పెళ్లి ఫిక్స్ చేశారు.

అప్ప‌టిక‌ప్పుడు ఆమెను పెళ్లి కుమార్తెను చేసి, వెంట‌నే క‌ల్యాణ‌మంట‌పానికి బ‌య‌లుదేరారు. తెల్లారేస‌రికి గురేష్ మిస్సింగ్‌. వ‌ధువు చెల్లెలితో పెళ్లి ఇష్టం లేక గురేష్ పారిపోయిన‌ట్లు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మాలూరు పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here