చనిపోయిన తన తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడతారా అన్న చంద్రబాబు..!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ళు ముక్కారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా ఓ వర్గం మీడియా కూడా అందుకు సంబంధించి కథనాలు ప్రచురించింది. తాను మామూలుగా నమస్కరించానని.. ఉన్నదీ లేనిది రాస్తున్నారని.. ఏది పడితే అది ప్రచురిస్తున్నారని.. చంద్రబాబు నాయుడు ఎంతో దుర్మార్గుడని అన్నారు. అంతేకాకుండా ఒక తల్లికి, ఒక తండ్రికి పుట్టినవారు చంద్రబాబులా మాట్లాడరంటూ విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కోపాన్ని వ్యక్తం చేశారు.


ఎవరికైనా తల్లిదండ్రులు దైవంతో సమానమని… చనిపోయిన తన తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. ఎవరి తల్లిదండ్రులనైనా నిందించడం భారతీయ సంప్రదాయమా? అని ప్రశ్నించారు. ప్రధాని కాళ్లకు మొక్కడం భారతీయ సంప్రదాయమా?అని నిలదీశారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రధాని కార్యాలయం చేరదీస్తోందని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో ఈ ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి న్యాయం జరగాలని పోరాడుతున్న తనపైనే బురదజల్లే కార్యక్రమాన్ని వైసీపీ నేతలు చేపట్టారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఏపీ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here