పవన్ కళ్యాణ్ కు ఎన్ని ఓట్లు వస్తాయో జోస్యం చెప్పేసిన చంద్రబాబు..!

పవన్ కళ్యాణ్ కూ అతని పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క శాతం ఓట్లు కూడా పడవని చెప్పుకొచ్చారు. ఈరోజు ఉదయం మహానాడులో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారని, ఆయన పోటీ చేస్తే, ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకు ఓట్లు వేసేవారు ఒక్క శాతం కూడా లేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తనను విమర్శించడానికి భారతీయ జనతా పార్టీ పవన్ కల్యాణ్ ను వాడుకుంటోందని, బీజేపీ మాటలను నమ్మి ఆయన తనపై నిత్యమూ అర్థరహిత విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి అన్ని రకాల బిల్లులనూ కేంద్రానికి పంపినా, తమకేవీ అందలేదని అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయి నేతలు మాట్లాడాల్సిన తీరు ఇది కాదని అన్నారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై తాను ధర్మపోరాటం చేస్తున్నానని, ఈ పోరాటంలో ప్రజలే అండగా, తాను విజయం సాధిస్తానన్న నమ్మకం తనకుందని తెలిపారు. యూసీల గురించి అడగాలనుకుంటే ప్రధానమంత్రి అడగాలని అన్నారు. పాలనా వ్యవహారాల్లోకి బీజేపీ అధ్యక్షుడు తలదూర్చడం సరికాదని, సొంత పార్టీ వ్యవహారాల వరకే ఆయన పరిమితమైతే మంచిదని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల సొమ్మును గుజరాత్ కు తరలిస్తున్నారని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here