వాట్సన్ ఉతికేరాయగా.. హైదరాబాద్ చిన్నబోయెనే..!

సాధారణంగా 120 పరుగులను కూడా కాపుడుకోగల బౌలింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ సీజన్-11 ఫైనల్ లో 178 పరుగులను కాపాడుకోలేకపోయింది. షేన్ వాట్సన్ ఆడిన ఇన్నింగ్స్ కు హైదరాబాద్ జట్టు కుదేలైపోయింది. ఏ మాత్రం అవకాశం అనేదే ఇవ్వకుండా వాట్సన్ మ్యాచ్ ను ముగించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడో ఐపీఎల్ టైటిల్ ను అందించాడు.

ధోనీ టాస్ గెలిచి హైదరాబాద్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. రెండో ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ శ్రీవత్స్ గోస్వామి (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్ ఆ తర్వాత నిలదొక్కుకుంది. మరో ఓపెనర్ శిఖర్ ధవన్‌తో కలిసిన కెప్టెన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. షకీబల్ హసన్, యూసుఫ్ పఠాన్‌, చివర్లో బ్రాత్‌వైట్ రాణించడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు భువనేశ్వర్ తన బౌలింగ్ పదునును చూపించాడు. భువీ మొదటి పది బంతులు డాట్ బాల్స్ అంటే ఎంత జాగ్రత్తగా చెన్నై జట్టు ఇన్నింగ్స్ ను ఆరంభించిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నాలుగో ఓవర్ చివరి బంతికి డుప్లెసిస్ (10) వికెట్‌ను కోల్పోయింది. ఇక మరో ఓపెనర్ షేన్ వాట్సన్ మాత్రం బాదుతూనే ఉన్నాడు. 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై తిరిగి 133 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో వాట్సన్‌కు ఇది మూడో సెంచరీ. మొత్తం 57 బంతులు ఎదుర్కొన్న వాట్సన్ 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 117 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టుకు ట్రోఫీ అందించాడు. చివర్లో అంబటి రాయుడు (16) విన్నింగ్ షాట్ కొట్టి 9 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here