దొంగ‌ల్ని చూసి గుండె ఆగి మ‌ర‌ణించాడంటోన్న భార్య‌: మృత‌దేహంపై చూస్తే గాయాలు

అనుమానాస్పద స్థితిలో ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో చోటు చేసుకుంది. మంకీ క్యాప్ వేసుకున్న అయిదుమంది దొంగ‌లు తెల్ల‌వారు జామున అయిదుమంది దొంగ‌లు ఇంట్లో జొర‌బ‌డ్డార‌ని, వారిని చూసి త‌న భ‌ర్త గుండె ఆగి మ‌ర‌ణించాడ‌ని మృతుని భార్య చెబుతోంది.

మృత‌దేహంపై గాయాలు, గొంతు నులిమిన ఆన‌వాళ్లూ క‌నిపిస్తున్నాయి. దీనితో పోలీసుల అనుమానం మొద‌ట మృతుని భార్య‌పైనే మ‌ళ్లింది. తాము అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఆమె పొంత‌న లేని స‌మాధానాల‌ను కూడా ఇస్తుండ‌టం అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తోంది.

మృతుడి పేరు రామ్‌నాథ్‌. విక‌లాంగుడు. జిల్లాలోని తంబళ్లపల్లె మండలం తిమ్మయ్యగారిపల్లెకు చెందిన రామ్‌నాథ్‌కు క‌డ‌ప జిల్లా ఈడిగపల్లెకు చెందిన ఏఎన్‌ఎం లక్ష్మీతో వివాహమైంది. మదనపల్లెలోని విజయనగర కాలనీలోని వారు నివాసం ఉంటున్నారు.

రామ్‌నాథ్ ల్యాబ్‌లో అసిస్టెంట్‌గా ప‌నిచేసేవాడు. శనివారం తెల్లవారుజామున అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. తెల్ల‌వారుజామున 4:30 గంటల సమయంలో తన భర్త బాత్‌ రూమ్‌కు వెళ్ల‌డానికి ఇంటి తలుపులు తీశారని, ఆ సమయంలో అయిదుమంది దొంగలు ఇంటిలోకి చొరబడ్డారని, వారిని చూసి భర్త గుండె ఆగి చనిపోయాడని లక్ష్మి చెబుతోంది.

ఇంట్లో జొర‌బ‌డ్డ దొంగలు బీరువాలో దాచి ఉంచిన అయిదు వేల రూపాయ‌ల‌ నగదు, భర్త మెడలోని బంగారు చైను, తన మెడలోని మరో బంగారు చైను అపహరించారని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

పోలీసుల అనుమానాలు మాత్రం ల‌క్ష్మిపైనే ఉన్నాయి. మృతుడి గొంతుపై కమిలిన గాయాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here