బొద్దింక‌ల కోసం అంటూ విషాన్ని కొన్నాడు.. తెల్లారే స‌రికి ఆ ఇంట్లో అంద‌రూ మ‌ర‌ణించారు!

ఇంట్లో బొద్దింక‌లు ఎక్కువ‌య్యాయ‌ని, వాటిని చంప‌డానికంటూ స్థానికంగా ఓ షాప్ నుంచి విషాన్ని కొనుగోలు చేశాడో వ్య‌క్తి. తెలిసిన వ్య‌క్తే కావ‌డంతో.. ఆ షాపు వాళ్లకు కూడా ఎలాంటి అనుమార‌మూ రాలేదు.

ఉద‌యం విషాన్ని కొన్నాడు.. సాయంత్రానికి ఆ ఇంట్లో ఉండే న‌లుగురూ మృత‌దేహాలై క‌నిపించారు. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం అరిలోవలో చోటు చేసుకుంది.

అరిలోవ స‌మీపంలోని ముస్త‌ఫా న‌గ‌ర్‌లో నివాసం ఉండే రాజేశ్‌, అత‌ని భార్య సౌమ్య‌, కుమారుడు విష్ణు, కుమార్తె జాహ్న‌వి చ‌నిపోయారు. త‌న ఇద్దరు పిల్లలకు విషాన్ని పెట్టిన రాజేశ్‌, సౌమ్య‌.. వారు చ‌నిపోయార‌ని నిర్ధారించుకున్న త‌రువాత తామూ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

ఆర్థిక ఇబ్బందుల వ‌ల్లే రాజేశ్ త‌న కుటుంబంతో స‌హా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేశ్ స్వ‌స్థ‌లం ప్రకాశం జిల్లా కనిగిరి. కొద్దిరోజుల కింద‌ట అత‌ను త‌న కుటుంబంతో స‌హా వ‌చ్చి ముస్త‌ఫాన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నాడు.

కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. గురువారం ఉద‌యం విషాన్ని కొన్నరాజేశ్‌.. పిల్లలిద్దరికీ ఆహారంలో క‌లిపి ఇచ్చాడు. వారు మ‌ర‌ణించార‌ని నిర్ధారించుకున్న త‌రువాత రాజేశ్‌, సౌమ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంట‌నే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here