కంటిదీపం ఆరిపోయింద‌ని..!

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె అకాల మ‌ర‌ణం పాలైతే.. దాన్ని త‌ట్టుకోలేక పోయారా దంప‌తులు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లాలో ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలోని కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన సందీప్, నవనీత దంపతులకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. అయిదేళ్ల కుమార్తె పేరు స‌హ‌న.

మూడేళ్ల కుమారుడి పేరు మ‌ణిదీప్‌. మార్చి 7న కూతురు సహన తీవ్రమైన జ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. త‌మ కంటిదీపం ఆరిపోవ‌డం సందీప్ దంప‌తుల‌ను మాన‌సికంగా కుంగ‌దీసింది. స‌హ‌న భౌతిక కాయానికి అంత్య‌క్రియ‌లు చేసిన‌ప్ప‌టి నుంచీ వారు రోజూ స్మ‌శానికి వెళ్తుండేవారు. అంత్య‌క్రియ‌లు చేసిన చోటే రాత్రిపూట నిద్రించ‌డానికి ప్ర‌య‌త్నించే వాళ్లు.

వారిని చూసిన స్థానికులు, బంధువులు వెన‌క్కి తీసుకొస్తుండేవారు. పోయిన‌వాళ్లు ఇక తిరిగి రార‌ని, ఉన్న మూడేళ్ల కుమారుడిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని చెబుతుండేవాళ్లు. శుక్ర‌వారం ఉద‌యం తాము ఊరికి వెళ్తున్నామని చెప్పి కొడుకు మణిదీప్‌ను త‌న తండ్రి ఇంటి వద్ద వదిలి పెట్టి వ‌చ్చాడు సందీప్‌. అనంత‌రం- భార్యభర్తలిద్దరూ తమ ఇంట్లోనే లోపలి నుంచి గడియ వేసుకొని ఒకే సీలింగ్ ఫ్యానుకు ఒకే చీరతో ఉరి వేసుకుని మృతి చెందారు.

సందీప్ తండ్రి అత‌నికి ప‌లుమార్లు ఫోన్ చేసిన‌ప్ప‌టికీ.. స్పందించ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చింది. ఇంటికి వెళ్లి కిటికీలోంచి చూడగా ఇద్దరు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. దీంతో త‌లుపు ప‌గుల కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వారు మృతి చెందారు.

తాము తమ కూతురిని మరువలేకపోతున్నామని, మనసు ప్రశాంతగా లేదని తమ పాపపై ప్రేమను డైరీలో రాసుకున్నారు. కూతురి మృతిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని భార్య భర్తలు తమ డైరీలో రాసుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here