న‌ట్టింట్లో ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహాలు: పాల‌వాడు చెబితే గానీ తెలియ‌లేదు!

విజ‌య‌వాడ‌: కృష్ణాజిల్లా గుడివాడలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులను కొట్టి చంపారు. వృద్ధుల‌నే క‌నిక‌రం లేకుండా విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టారు. దీనితో వారు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. గుడివాడ రాజేంద్రరనగర్ ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మృతుల‌ను బొప్పన సాయిచౌదరి, నాగమణిగా గుర్తించారు. వారిని కొట్టి చంపిన త‌రువాత ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకు వెళ్లారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును కూడా దుండగులు అపహరించుకు వెళ్లారు. అర్ధ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంటే.. తెల్ల‌వారేంత వ‌ర‌కూ ఈ విష‌యం వెలుగులోకి రాలేదు.

పాల‌ను పోయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి మొద‌ట‌గా ఈ దారుణాన్ని గ‌మ‌నించారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఇరుగు పొరుగును అప్ర‌మ‌త్తం చేశారు.

సమాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి హాల్‌లో రక్తం మడుగులో పడివున్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌ మార్టంకు తరలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here