కంబైన్డ స్ట‌డీస్ చేస్తున్నార‌నుకున్నారు..ఇలా 8వ అంత‌స్తు నుంచి దూకుతార‌ని ఊహించ‌లేదు!

హైద‌రాబాద్‌: ఇద్ద‌రు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినులు అపార్ట్‌మెంట్ పైనుంచి కిందికి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది.

కంబైన్డ్ స్ట‌డీస్ కోసం ఒకే చోటికి చేరిన ఈ విద్యార్థినులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఎల్బీన‌గ‌ర్ టీఎన్ఆర్ వైష్ణ‌వి శిఖ‌ర అపార్ట్‌మెంట్ 8వ అంతస్తులో నివసించే వ్యాపారి కాంతి భాయ్ ప‌టేల్ చిన్న కుమార్తె భార్గవి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని.

హస్తినాపురంలోని అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఆమె చదువుతోంది. ఇటీవలే పదోతరగతి పరీక్షలు మొదలవడంతో భార్గ‌వి.. త‌న తోటి విద్యార్థిని శ్రావ‌ణితో క‌లిసి కంబైన్డ్ స్ట‌డీస్ చేస్తున్నారు. రోజూలాగే శ్రావణి గురువారం సాయంత్రం కంబైన్డ్ స్ట‌డీస్ కోసం నివ‌సిస్తోన్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది.

సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇద్ద‌రూ అదే అపార్ట్‌మెంట్ పైఅంత‌స్తుకు చేరుకున్నారు. అక్క‌డి నుంచి కిందికి దూకారు. తీవ్ర గాయాలు కావ‌డంతో సంఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న ఎల్బీ న‌గ‌ర్ పోలీసులు భార్గవి ఫ్లాట్‌ను ప‌రిశీలించారు.

చెత్తబుట్టలో శ్రావణి రాసినట్లుగా భావిస్తోన్న సూసైడ్‌నోట్‌ దొరికింది. అందులో ‘డియర్‌ మా.. పా.. సారీ..’, ‘ఐ మిస్‌యూ తేజూ..’ అంటూ రాసి ఉంది. దీని ఆధారంగా శ్రావణి ఆత్మహత్య చేసుకునేందుకు భార్గవి ఇంటి బాల్కనీకి చేరుకుని ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు.

భార్గ‌వి ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త లోపించింది. ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన త‌న ప్రాణ స్నేహితురాలిని ర‌క్షించే సంద‌ర్భంలో భార్గ‌వి కూడా కింద ప‌డి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న రెండు కుటుంబాల్లోనూ తీర‌ని విషాదాన్ని మిగిల్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here