ప‌దడుగుల లోతులో..పైప్‌లైన్‌లో..12 గంట‌ల న‌ర‌క‌యాత‌న‌!

భూ ఉప‌రిత‌లానికి సుమారు 10 అడుగుల లోతులో వేసిన మంచినీటి పైప్‌లైన్ అది. మంచినీటి పంపింగ్ స్టేష‌న్‌కు అనుసంధానించి ఉంటుంది. కొద్దిరోజులుగా మంచినీరు స‌రిగ్గా స‌ర‌ఫ‌రా కావ‌ట్లేదనే ఫిర్యాదు అంద‌డంతో.. దాన్ని శుభ్రం చేయ‌డానికి ఇద్ద‌రు కార్మికులు ఆ పైప్‌లైన్‌లోకి వెళ్లారు.

పంపింగ్ స్టేష‌న్ వ‌ద్ద ఒక కొస నుంచి సుమారు 500 మీట‌ర్ల వ‌ర‌కు శుభ్రం చేసుకుంటూ పైప్‌లోనికి వెళ్లారు. ఊపిరి ఆడ‌క ఒక‌రు బ‌య‌టికి రాగా.. మ‌రొక‌రు అందులో చిక్కుకుపోయారు. ఒక‌టి కాదు, రెండు కాదు, సుమారు 12 గంట‌ల పాటు ఆ పైప్‌లైన్‌లో చిక్కుకుపోయారా కార్మికుడు. బ‌య‌టికి వ‌చ్చిన తోటి కార్మికుడు ఈ విష‌యాన్ని పంపింగ్ స్టేష‌న్ సిబ్బందికి తెలిపారు.

 

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క ద‌ళ సిబ్బంది, రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణా విభాగం ఉద్యోగులు రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయినప్ప‌టికీ.. ఆ కార్మికుడిని బ‌య‌టికి తీసుకుని రావ‌డానికి 12 గంట‌లు ప‌ట్టింది. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని క‌ట‌క్‌లో చోటు చేసుకుంది.

ఆ కార్మికుడి పేరు ప్రాణుకృష్ణ ముడులి. పంపింగ్ స్టేష‌న్ ఉద్యోగి. క‌ట‌క్ రాష్ట్ర పోలీస్ సిగ్న‌లింగ్ ప్రధాన కార్యాల‌యానికి ఆనుకుని ఉన్న లోయ‌ర్ పోలీస్ కాల‌నీకి మంచినీటిని స‌ర‌ఫ‌రా చేసే పైప్‌లైన్‌లో గురువారం ఉద‌యం ఆ కార్మికుడు చిక్కుకుపోయారు. రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో అత‌ణ్ని ర‌క్షించారు.

వెంట‌నే- ఆ కార్మికుడిని శ్రీ‌రామ‌చంద్ర భాంజా వైద్య క‌ళాశాల‌, ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్రాణుకృష్ణ ముడులి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది, విప‌త్తు నిర్వ‌హ‌ణ ఉద్యోగులు 12 నుంచి 14 గంట‌ల పాటు నిరంత‌రాయంగా శ్ర‌మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here