హెల్మెట్‌ను రాత్రిపూట‌ బైక్‌కే త‌గిలిస్తున్నారా? నెత్తిన పెట్టుకోబోయే ముందు జ‌ర జాగ్ర‌త్త‌!

హెల్మెట్‌ను రాత్రిపూట ఆఫీస్ బ‌య‌టే వ‌దిలిపెట్టేసి వెళ్లాడో రూధ‌ర్‌ఫ‌ర్డ్ అనే ఫైర్ ఫైట‌ర్‌. ఫైర్ ఫైట‌ర్ అంటే సినిమాల్లోలా ఫైట్ మాస్ట‌ర్ కాదు. అగ్నిమాప‌క ద‌ళం ఉద్యోగి.

తెల్లారిన త‌రువాత రోజూలాగే ఆఫీస్‌కు వెళ్లాడు. పొద్దుటే డ్రిల్‌లో పాల్గొన‌డానికి రెడీ అయ్యాడు. యూనిఫాం వేసుకుని, నెత్తిన పెట్టుకోవ‌డానికంటూ హెల్మెట్ తీసుకోబోయాడు.

ఒక్క‌సారిగా ఎగిరి వెన‌క్కి దూకాడు. ఎందుకంటే.. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన, విష‌పూరిత‌మైన పాము అందులో బ‌జ్జుంది. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌లో చోటు చేసుకుంది.

పామును చూసిన వెంట‌నే అత‌ను స్నేక్ రెస్క్యూవ‌ర్ల‌కు స‌మాచారం ఇచ్చాడు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క విభాగం కార్యాల‌యానికి వ‌చ్చారు పాముల సంర‌క్ష‌కులు.

హెల్మెట్‌లో బ‌జ్జున్న పామును ప‌ట్టుకోబోయారు. అది కాస్త వారి చేతుల్లో నుంచి త‌ప్పించుకుంది. అయిన‌ప్ప‌టికీ దాన్ని వ‌ద‌ల్లేదు. చాక‌చ‌క్యంగా ప‌ట్టుకుని సంచిలో వేసేసుకున్నారు.

చూడ్డానికి రెండ‌డుగుల పొడుగే ఉన్న‌ప్ప‌టికీ.. ఆస్ట్రేలియాలో అత్యంత విష‌పూరిత పాముల్లో అదీ ఒక‌ట‌ట‌. ఈ పామును ప‌ట్టుకునే వీడియోను న్యూ సౌత్ వేల్స్ అగ్నిమాప‌క సిబ్బంది త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్టు చేశారు. దీన్ని తెగ చూసేస్తున్నారు జ‌నం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here