మా అమ్మ‌కు పెళ్లి: 53 ఏళ్ల వితంతు త‌ల్లికి ద‌గ్గ‌రుండి మ‌ళ్లీ పెళ్లి జ‌రిపించిన 22 ఏళ్ల కుమార్తె

అప్పుడెప్పుడో లేట్ నైన్టీస్‌లో `మా నాన్న‌కు పెళ్లి` అనే టైటిల్‌తో వ‌చ్చిందో మూవీ. ఇదేదో వెరైటీ టైటిల్ అని అనుకున్నారు జ‌నం. సినిమానూ హిట్ చేసేశారు. ఇది కూడా అలాంటి ఘ‌ట‌నే. కాక‌పోతే రీల్ స్టోరీ కాదు.. రియ‌ల్ లైఫ్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌.

భ‌ర్త‌ను పోగొట్టుకున్న త‌ల్లికి అండ‌గా నిలిచింది 22 సంవ‌త్స‌రాల కుమార్తె. వితంతురాలైన త‌న 53 సంవ‌త్స‌రాల త‌ల్లి కోసం వ‌రుడిని వెదికి తెచ్చింది. ద‌గ్గ‌రుండి పెళ్లి జ‌రిపించింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో చోటు చేసుకుంది.

ఆ కుమార్తె పేరు సంహిత‌. త‌ల్లి పేరు గీతా అగ‌ర్వాల్‌. స్కూల్ టీచ‌ర్‌. 2016 మేలో గుండెపోటుతో గీతా అగ‌ర్వాల్ భ‌ర్త ముఖేష్ గుప్తా మ‌ర‌ణించారు. దీనితో గీతా అగ‌ర్వాల్ డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయారు.

ఆసుప‌త్రుల చుట్టూ తిర‌గాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. గుర్‌గావ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తోన్న ఆమె కుమార్తె సంహిత‌.. త‌ల్లిని బ‌తికించుకోవాల‌ని నిర్ణ‌యించారు.

ఉద్యోగానికి రాజీనామా చేసి జైపూర్‌కు వెళ్లిపోయారు. త‌ల్లికి అండ‌గా నిలిచారు. త‌ల్లికి ఎలాగైనా పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యానికొచ్చారు. ఆమె నిర్ణ‌యాన్ని ఇంట్లో వారంద‌రూ వ్య‌తిరేకించారు.

53 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లా అంటూ పెద‌వి విరిచారు. అయినప్ప‌టికీ.. సంహిత త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోలేదు. త‌న త‌ల్లికి కొత్త జీవితాన్ని ఇవ్వాల‌నుకున్నారు.

ఆమె అన్వేష‌ణ మొద‌లైంది. వితంతువుల కోసం ఏర్పాటు చేసిన మ్యారేజ్‌బ్యురోలు, వెబ్‌సైట్ల‌ను వెతికారు. రాజ‌స్థాన్‌లో త‌మ‌కు తెలిసిన కుటుంబాలను సంప్ర‌దించారు.

చివ‌రికి ఆమె అన్వేష‌ణ ఫ‌లించింది. రాజ‌స్థాన్‌లోని బాన్స్‌వారా న‌గ‌రానికి చెందిన 55 సంవ‌త్స‌రాల రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ కేజీ గుప్తా ఆస‌క్తి చూపారు. ఆయన భార్య 2010లో కేన్స‌ర్‌తో మ‌ర‌ణించారు.

అప్ప‌టి నుంచి ఆయ‌న కూడా ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతున్నారు. గీతా అగ‌ర్వాల్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ఆయ‌న సంహిత‌ను సంప్ర‌దించారు. గుడ్డిగా పెళ్లి చేయ‌లేదామె. అన్ని వివ‌రాల‌పైనా ఆరా తీశారు.

కేజీ గుప్తా వ్య‌క్తిత్వం ప‌ట్లా వివ‌రాల‌ను తెలుసుకున్నారు. అన్ని విధాలుగా స‌రైన‌వాడేన‌ని తేల‌డంతో సంహిత‌.. ద‌గ్గ‌రుండి త‌న త‌ల్లికి మ‌ళ్లీ పెళ్లి చేశారు. డిసెంబ‌ర్ 28న వారి వివాహం జైపూర్‌లో సంప్ర‌దాయ‌బద్ధంగా జ‌రిగింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here