జాతీయ ర‌హ‌దారికి ఓ కిలోమీట‌ర్ దూరంలో పార్క్ చేసిన కారులో..!

జాతీయ ర‌హ‌దారికి సుమారు ఓ కిలోమీట‌ర్ దూరంలో పార్క్ చేసి ఉంచిన నీలం రంగు మిత్సుబిషి లాన్స‌ర్ కారు అది.. సుమారు నాలుగురోజులుగా అలాగే ప‌డి ఉంది. పెద్ద‌గా జ‌న సంచారం లేని చోట ఖ‌రీదైన కారు అలా ఎందుకు ప‌డి ఉందో అని స్థానికుల‌కు అనుమానం వ‌చ్చింది. వెంట‌నే స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు రావ‌డానికి ముందే- కారులో తొంగి చూడ‌గా.. రెండు మృత‌దేహాలు బాగా ఉబ్బిపోయిన స్థితిలో క‌నిపించాయి. ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు స్థానికులు.

పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, కారు అద్దం ప‌గుల గొట్టి, లాక్ ఓపెన్ చేశారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగురోజుల కింద‌ట అదృశ్య‌మైన యువ‌తీ, యువ‌కుడి మృత‌దేహాలుగా గుర్తించారు. త‌మ కుమార్తె, కుమారుడు క‌నిపించ‌ట్లేదంటూ వారి త‌ల్లిదండ్రులు వేర్వేరుగా అప్ప‌టికే పోలీస్‌స్టేష‌న్ల‌లో కేసు న‌మోదు చేసి ఉండ‌టంతో.. మృత‌దేహాలు ఎవ‌రివ‌నే విష‌యం త్వ‌ర‌గానే తేలింది.

విషం సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టుగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న ముంబై శివార్ల‌లోని ములుంద్‌లో చోటు చేసుకుంది. మృతుల‌ను స‌ల్మాన్ అఫ్రోజ్ ఖాన్‌, మ‌నీషా నారాయ‌ణ్ నేగిగా గుర్తించారు. వారిద్ద‌రూ ప్రేమికులు. ఇంట్లో వారికి తెలియ‌కుండా పెళ్లి కూడా చేసుకున్నారు. స‌ల్మాన్‌కు.. థానెలో గార్మెంట్స్ షాప్ ఉంది.

మ‌నీషా న‌వీ ముంబైలోని బేలాపూర్‌లో నివసిస్తూ, సేల్స్‌గ‌ర్ల్‌గా ఓ మాల్‌లో ప‌నిచేస్తుండేది. త‌న‌కు ఉన్న వృత్తిరీత్యా స‌ల్మాన్ త‌ర‌చూ మ‌నీషా ప‌నిచేసే షాప్ ఉన్న మాల్‌కు వ‌చ్చి పోతుండేవాడు. దీనితో ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం, ప్రేమ‌గా మారింది. పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విష‌యం మనీషా ఇంట్లో తెలిసింది.

దీనితో వారు స‌ల్మాన్‌ను చంపేస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతుండేవారు. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన వారిద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నారు. కారులో ములుంద్ జిల్లా న్యాయ‌స్థానం ఎదురుగా జాతీయ ర‌హ‌దారిపై కొంత దూరంలో కారును పార్క్ చేసి, విషం సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. నాలుగురోజుల త‌రువాత ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here