త‌ల‌కు దెబ్బ‌త‌గిలి ఆసుప‌త్రికెళ్తే.. కాలికి ఆప‌రేష‌న్ చేసి..రాడ్ కూడా వేశారు!

న్యూఢిల్లీ: క‌డుపున‌కు ఆప‌రేష‌న్ చేసి, అందులో దూది, వీలైతే క‌త్తెర్ల‌ను కూడా పెట్టి మ‌రిచిపోతుంటారు డాక్ట‌ర్లు. త‌న క‌డుపులో దూదిఉండ‌ను మోస్తున్నాన‌ని తెలుసుకునేట‌ప్పటికి స‌ద‌రు పేషెంట్ స‌గం జీవితం ఖ‌ర్చ‌యిపోతుంది. ఢిల్లీ డాక్ట‌ర్లు ఓ అడుగు ముందుకేశారు. మిగిలిన వారి కంటే నాలుగాకులు ఎక్కువే చదివిన‌ట్టున్నారు.

అందుకే- త‌ల‌కు చేయాల్సిన ఆప‌రేష‌న్‌ను కాలికి చేశారు. కాలిలో ఓ రాడ్‌ను కూడా పెట్టేశారు. ఆప‌రేష‌న్ చేయ‌డానికి ముందు ఇచ్చిన మందు ఎఫెక్ట్ వ‌ల్ల పాపం.. ఆ పేషెంట్‌కు ఎక్క‌డ ఆప‌రేష‌న్ చేస్తున్నార‌నేది కూడా తెలియ‌కుండా పోయింది. స్పృహ వ‌చ్చిన త‌రువాత చేసేదేమీ లేకుండా పోయింది. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని సుశృత ట్రౌమా కేర్ సెంట‌ర్‌లో చోటు చేసుకుంది.

వీరేంద్ర అనే రోగికి చేయాల్సిన ఆప‌రేష‌న్‌ను విజేంద్ర అనే మ‌రో పేషెంట్ చేశారు. వీరేంద్ర అనే వ్య‌క్తి కుడి కాలి ఎముక విరిగింది. దీనితో అత‌ను సుశృత ఆసుప‌త్రిలో చేరాడు. అదే స‌మ‌యానికి ఘ‌జియాబాద్‌కు చెందిన విజేంద్ర అనే మ‌రో పేషెంట్ కూడా అదే ఆసుప‌త్రిలో చేరారు. ఆరు నెల‌ల కింద‌ట బైక్‌పై వెళ్తూ కింద‌ప‌డ‌గా విజేంద్ర త‌ల‌కు గాయ‌మైంది.

గాయం న‌య‌మైన‌ప్ప‌టికీ.. త‌ర‌చూ త‌ల‌నొప్పి, క‌ళ్లు తిర‌గడం వంటి ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్నారు విజేంద్ర. దీనితో ఆయ‌న సుశృత ట్రౌమా కేర్‌లో చికిత్స కోసం వ‌చ్చారు. శ‌స్త్ర చికిత్స కోసం ఏర్పాట్లు చేసిన సుశృత డాక్ట‌ర్లు.. విజేంద్ర‌, వీరేంద్ర అనే పేర్ల వ‌ద్ద క‌న్‌ఫ్యూజ్ అయ్యారు. విజేంద్ర కంటే ముందుగా వీరేంద్ర కాలికి ఆప‌రేష‌న్ చేయాల్సి ఉంది.

పొర‌పాటున వీరేంద్ర‌నే విజేంద్ర‌గా భావించి..ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు తీసుకెళ్లారు. కుడి కాలికి శ‌స్త్ర చికిత్స చేశారు. అందులో ఓ రాడ్ కూడా అమ‌ర్చారు. స్పృహ వ‌చ్చిన త‌రువాత చూస్తే.. ఇంకేముంది? అంతా అయిపోయిందంటూ నెత్తి ప‌ట్టుకున్నారు విజేంద్ర‌.

బాగున్న కాలికి రాడ్ వేయ‌డం వ‌ల్ల వంచ‌డానిక్కూడా వీలు కావ‌ట్లేదంటూ విజేంద్ర‌, ఆయన కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విజేంద్ర కుటుంబీకులు సివిల్ లైన్స్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. డాక్ట‌ర్లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారంటూ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here